● బతికుండి సాధించమంటున్న నిపుణులు
మిరుదొడ్డి(దుబ్బాక): ఇదారి నవీన్ (27) అనే యువకుడు అక్బర్‌పేట–భూంపల్లి మండల పరిధిలోని రుద్రారంలో భార్య, ఇద్దరు పిల్లలతో జీవనం సాగించేవాడు. అక్బర్‌పేట–భూంపల్లి మండల కేంద్రంలో చిన్న ఎరువుల దుకాణం ఏర్పాటు చేసుకుని భార్యా పిల్లలను పోషించుకునేవాడు. ఈజీగా మనీ సంపాదించాలన్న అత్యాశతో ఆన్‌లైన్ బెట్టింగులకు అలవాటు పడ్డాడు. దీంతో చిన్నా చితకా సంపాదించిన డబ్బును సైతం ఆన్‌లైన్ గేమ్‌లు, బెట్టింగుల్లో పొగొట్టుకున్నాడు. దీంతో ఆశ చావని నవీన్ అప్పులు చేసి మరీ ఆన్‌లైన్ గేమ్‌లో పెట్టాడు. వెనక్కి తిరిగి చేసుకుంటే సర్వస్వం కోల్పోయాడు. దీంతో కుటుంబ పోషణ భారమైంది. అప్పుల వారి నుంచి ఒత్తిడి ఎక్కువైంది. అప్పుల సమస్య ముందు అతనికి చావే సులువనిపించింది. అప్పుల బాధ తాళలేక తాను నిర్వహిస్తున్న ఎరువుల దుకాణంలోని పురుగుల మందు తాగి తనువు చాలించాడు. దీంతో భార్య, ఇద్దరు బిడ్డలు దిక్కులేనివారయ్యారు. ఇది నవీన్ ఒక్కడి పరిస్థితే కాదు. జిల్లాలో చాలామంది యువకులు అప్పుల ఊబిలో చిక్కుకుని విలువైన ప్రాణాలను తీసుకుంటున్నారు. ఆత్మహత్యలకు పాల్పడి కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకుంటున్న ఘటనలు జిల్లాలో కొకొల్లలుగా ఉన్నాయి.
బ్యాంకు రుణాలే సురక్షితం
ప్రైవేటు సంస్థల కంటే జాతీయ బ్యాంకు రుణాలే సురక్షితంగా నిలుస్తాయి. ఒక వ్యక్తి తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని బట్టి బ్యాంకులు రుణాలు అందిస్తాయి. అతి తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చే బ్యాంకులే శ్రేయస్కరమని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలు అధిక వడ్డీలు, చక్ర వడ్డీలు విధించి రుణగ్రహీతల నడ్డి విరిచే ప్రమాదం ఉంది. దీంతో మానసిక ప్రశాంతత కరువై మనోవేదనతో తనువులు చాలించిన ఘటనలు ఉన్నాయి.
‘జీరో’అవ్వండి
అప్పుల బాధ తాళలేని కొందరు వ్యక్తులు చావే ఈజీ అనుకుంటారు. కానీ, ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలు రోడ్డున పడి చిన్నాభిన్నం అవుతుంటాయి. ఈ అప్పుల బాధ నుంచి బయట పడాలంటే అవసరమైతే తమకున్న ఆస్థిపాస్తులనమ్మి, అప్పులు తీర్చి జీరో స్థాయికి చేరుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మళ్లీ జీరో స్థాయి నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని సామాజిక విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అప్పు అవసరానికి ఆదుకునే సంజీవనిలా మురిపిస్తుంది. అప్పు తీర్చే క్రమంలో మరో అప్పు చేయడం ప్రమాదంలోకి నెట్టేస్తుంది. తెలియకుండానే అప్పు ఊబిలోకి నెట్టేస్తుంది. అప్పు తీసుకున్నవారు సకాలంలో చెల్లించని నేపథ్యంలో అప్పు ఇచ్చిన వారి మధ్య వైరం మొదలవుతుంది. దీంతో అప్పులు చాలా జీవితాల్లో ఆరని నిప్పులా పరిణమిస్తుంది.


