బస్సులేయండి సారూ! | - | Sakshi
Sakshi News home page

బస్సులేయండి సారూ!

Jul 31 2026 7:16 AM | Updated on Jul 31 2026 7:16 AM

ఆర్టీసీ బస్సుల రద్దుతో అవస్థలు

ఆర్టీసీ బస్సులు పల్లెలకు రాకపోవడంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే అనేక గ్రామాలకు బస్సు సౌకర్యం లేక ఆటోలను ఆశ్రయిస్తున్నారు. బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న గ్రామాల ప్రజలకు ఉన్న కొన్ని సర్వీసులను కూడా రద్దు చేయడం మరింత సమస్యగా మారింది.

పెద్దశంకరంపేట(మెదక్‌): రేగోడ్‌, పెద్దశంకరంపేట, పాపన్నపేట, టేక్మాల్‌ మండలాలను కలుపుతూ నిర్వహిస్తున్న మూడు సర్వీసులను గతేడాది వర్షాల కారణంగా రహదారులు దెబ్బతినడంతో మెదక్‌ ఆర్టీసీ అధికారులు నిలిపివేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆర్టీసీ బస్సులు గ్రామాలకు రాకపోవడంతో ప్రజలు ఆటోలు,ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించి ప్రమాదాల బారిన పడుతున్నారు.

జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే ప్రయాస

పెద్దశంకరంపేట మండలం నుంచి జిల్లా కేంద్రమైన మెదక్‌ కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయం, రిజిస్ట్రేషన్‌ కార్యాలయం, ఆర్టీఏ కార్యాలయం, కోర్టు, వ్యక్తిగత పనులపై వెళ్లే ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. జిల్లాలో మారుమూల మండలాలైన పెద్దశంకరంపేట, రేగోడ్‌కు జిల్లా కేంద్రం మెదక్‌ వెళ్లాలంటే నారాయణఖేడ్‌ నుంచి సిద్దిపేట బస్‌ ఒక్కటే దిక్కు. ఇది తప్పితే ఇక బొడ్మట్‌పల్లి మీదుగా వెళ్లక తప్పని పరిస్థితి. ఖేడ్‌ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు వచ్చే సిద్దిపేట బస్సు పెద్దశంకరంపేట నుంచి వేల్పుగొండ, ఎల్లుపేట్‌ మీదుగా మెదక్‌, సిద్దిపేట వెళ్తుంది. మిగతా సమయాల్లో వెళ్లాలంటే జిల్లా కేంద్రానికి నేరుగా బస్సులు లేవు. సాయంత్రం ఉన్న బస్సు కూడా రద్దు కావడంతో కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

బస్సుల రద్దుతో ఇబ్బందులు

గతంలో రేగోడ్‌ ఆర్డినరీ బస్సు సర్వీసు ఉదయం 6 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం 5 గంటలకు పెద్దశంకరంపేట మీదుగా మెదక్‌ వెళ్లేవి. ఈ బస్సు రేగోడ్‌ మండలం, పెద్దశంకరంపేట మండలం మల్కాపురం, జూకల్‌, పాపన్నపేట మండలం చీకోడ్‌, టేక్మాల్‌ మండలం వేల్పుగొండ, ఎల్లుపేట్‌తోపాటు పలు గ్రామాల మీదుగా రాకపోకలు సాగించేది. ఇందులో ముఖ్యంగా వివిధ పనులపై మండల కేంద్రానికి వచ్చేవారు, ప్రభుత్వ,ప్రైవేట్‌ పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. ప్రభుత్వం బస్సు సర్వీసులను రద్దు చేయడంపై ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తిరిగి ఆర్టీసీ బస్సుల సౌకర్యాన్ని కల్పించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

విద్యార్థులు, ప్రజలకు ప్రైవేట్‌ వాహనాలే దిక్కు

బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న వైనం

జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే జేబులకు చిల్లే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement