కల్హేర్(నారాయణఖేడ్): ఇంట్లో నిద్రిస్తున్న ఓ విద్యార్థి పాము కాటుతో మృతి చెందాడు. ఈ హృదయ విదారక ఘటన సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలో చోటుచేసుకుంది. సిర్గాపూర్ మండలంలోని రూప్లా తండాకు చెందిన రాథోడ్ సర్దార్, స్వరూప దంపతుల కుమారుడు రాథోడ్ చరణ్ (8) స్థానిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. బుధవారం రాత్రి ఎప్పటిలా కుటుంబ సభ్యులందరూ ఇంట్లో నిద్రపోయారు. అర్ధరాత్రి సమయంలో చరణ్‌ను పాము కాటు వేసింది. వెంటనే హుటాహుటినా ఆస్పత్రికి బయలుదేరగా.. మార్గమధ్యలోనే తుదిశ్వాస విడిచాడు. దీంతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యార్థి అకస్మాత్తు మృతిపై ఎంఈఓ నాగరం శ్రీనివాస్ సంతాపం వ్యక్తం చేశారు.
పటాన్‌చెరు టౌన్: స్థానిక పట్టణ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి అస్థిపంజరం లభ్యమైనట్లు బీడీఎల్ పోలీసులు తెలిపారు. బీడీఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామచంద్రపురం ప్రాంతంలోని ఈదుల నాగులపల్లి గ్రామ శివారులో గల యూని యాడ్స్ కంపెనీకి చెందిన నిర్మానుష్య భూమిలో స్థానికులకు గురువారం ఒక పురుషుడి అస్థిపంజరం కనిపించింది. వెంటనే సమాచారం అందుకున్న వెంటనే సీఐ విజయ్ కృష్ణ తన సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. అక్కడ పడి ఉన్న అస్థిపంజరాన్ని పరిశీలించారు. అస్థిపంజరానికి సమీపంలో నీలం రంగు డ్రాయర్, షర్టును పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం మృతుడి ఎముకల నమూనాలను సేకరించి, పూర్తి వివరాలపై ఆరా తీస్తున్నారు. ఈ దుస్తుల ఆధారంగా లేదా మృతుడి గురించి ఎవరికై నా ఎలాంటి సమాచారం తెలిసినా, వెంటనే బీడీఎల్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సీఐ విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
రిటైర్డ్ ఉద్యోగికి
రూ.33 లక్షల టోకరా
రామచంద్రాపురం (పటాన్‌చెరు): అధిక లాభాల ఆశ చూపించి నకిలీ ట్రేడింగ్ యాప్ ద్వారా ఓ రిటైర్డ్ ఉద్యోగి వద్ద రూ.33 లక్షలు కాజేసిన ఘటన తెల్లాపూర్ డివిజన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. తెల్లాపూర్ డివిజన్ పరిధిలో నివాసముండే రిటైర్డ్ ఉద్యోగి మాణిక్ రెడ్డిని ’అపెక్స్ డిజిటల్ క్యాపిటల్’ పేరుతో వాట్సాప్ గ్రూప్‌లో చేర్చిన నిందితులు, డీఎంఏ ట్రేడింగ్ పేరుతో పెట్టుబడులు పెట్టాలని ప్రలోభపెట్టారు. వారు పంపిన యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న బాధితుడు పలు దఫాలుగా వివిధ బ్యాంకు ఖాతాలకు మొత్తం రూ.33 లక్షలు బదిలీ చేశారు. ఆ తర్వాత ఐపీఓలో పెట్టుబడి పేరుతో నిందితులు మరింత నగదు డిమాండ్ చేయడంతో బాధితుడికి అనుమానం వచ్చి విత్‌డ్రా చేయడానికి ప్రయత్నించారు. డబ్బులు రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నర్సాపూర్ రూరల్: భూ వివాదంలో హత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరి నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నర్సాపూర్ ఎస్సై రంజిత్‌రెడ్డి గురువారం తెలిపారు. నర్సాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నాగులపల్లి గ్రామానికి చెందిన కొర్పోల్ శంకరయ్యపై, అదే గ్రామానికి చెందిన దాయాదులు కొర్పోల్ గంగాధర్, కొర్పోల్ గోపాల్ అన్నదమ్ములు ఈ నెల 28న రాత్రి ముందస్తు ప్రణాళిక ప్రకారం ఆయన ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో శంకరయ్యకు పలుచోట్ల తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అప్రమత్తమై నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించగా వారు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను అదుపు లోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించడంతో వారిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. కొర్పోల్ శంకరయ్యకు, నిందితులకు గత కొంతకాలంగా భూ వివాదం నడుస్తుండటంతో కక్ష గట్టే ఈ దాడికి పాల్పడినట్లు వెల్లడించారు.
హుస్నాబాద్: వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. అక్కన్నపేట మండలం కేశ్వాపూర్‌కు చెందిన కలబోయిన శ్రావణి (35) నాగరాజు దంపతులు ఇద్దరు కుమారులతో కలిసి కొంత కాలం నుంచి పట్టణంలోని నాగారం రోడ్డులో అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నారు. నాగరాజు కొందరిని దుబ్బాయికి పంపిస్తానంటూ పైరవీలు చేస్తూ అప్పుల పాలయ్యాడు. దీంతో భార్యభర్తల మధ్య కలహాలు చోటు చేసుకున్నాయి. అనేక మార్లు భార్యను వేధింపులకు గురిచేసిచేశాడు. ఈ క్రమంలో గురువారం ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. శ్రావణి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లక్ష్మారెడ్డి తెలిపారు.


