వరుస చోరీల ముఠా అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

వరుస చోరీల ముఠా అరెస్ట్‌

Jul 31 2026 7:16 AM | Updated on Jul 31 2026 7:16 AM

ఇళ్లలో చోరీలు

పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్ర దొంగలు

పోలీసుల అదుపులో ఇద్దరు దొంగలు

సంగారెడ్డి టౌన్‌: జైలు నుంచి విడుదలైన వెంటనే పాత అలవాటును మార్చుకోకుండా మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను సంగారెడ్డి రూరల్‌ పోలీసులు పట్టుకున్నారు. డీఎస్పీ సత్తయ్య గౌడ్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం సంగారెడ్డి చౌరస్తా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా సంచరిస్తూ కనిపించారు. అయితే పోలీసులను చూసి పొంతన లేని సమాధానాలు చెప్పడంతో వారిపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో సంగారెడ్డి పరిసర ప్రాంతాలతో పాటు పలుచోట్ల వరుస చోరీలకు పాల్పడినట్లు నేరాన్ని అంగీకరించారు. ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్‌ రెడ్డి (28)పై హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో కలిపి మొత్తం 84 కేసులు ఉన్నట్లు తేలింది. అయితే ఈశ్వర్‌ (22)తో కలిసి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి మళ్లీ దొంగతనాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే సంగారెడ్డి, హైదరాబాద్‌తో పాటు ఏపీలోని కర్నూలు వరకు వెళ్లి చోరీలకు పాల్పడ్డారు. మామిడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో తాళాలు పగులగొట్టి కంప్యూటర్లు, బ్యాటరీలు, మానిటర్లను ఎత్తుకెళ్లడంతో పాటు, బేగంపేటలోని ఓ ఇంట్లోకి చొరబడి 3.5 తులాల బంగారం, 8 తులాల వెండి ఆభరణాలను దోచుకున్నారు. నిందితుల నుంచి 2 రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైకులు, యాక్టివా స్కూటీ, 4 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి ఇద్దరినీ రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సమావేశంలో రూరల్‌ సీఐ నయీముద్దీన్‌, ఎస్సై మధుసూదన్‌ రెడ్డి, రూరల్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జహీరాబాద్‌ టౌన్‌: జహీరాబాద్‌ రూరల్‌, చిరాగ్‌పల్లి పరిధిలో వైన్స్‌ దుకాణంతో పాటు పలు ఇళ్లలో చోరీలకు పాల్పడిన ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్‌ఐలు వినయ్‌కుమార్‌, రాజేంద్రరెడ్డి వివరాలు వెల్లడించారు. మొగుడంపల్లి శ్రీరేణుక ఎల్లమ్మ వైన్స్‌తో పాటు జహీరాబాద్‌, అల్గోల్‌లో జరిగిన దొంగతనాలపై సీసీటీవీ పుటేజ్‌, సాంకేతిక ఆధారాల సహాయంతో పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ మేరకు చోరీకి పాల్పడిన మహారాష్ట్రలోని పూణేకు చెందిన రాహుల్‌ నందు రాథోడ్‌, జోగ్‌రాజ్‌ గురుదర్‌సింగ్‌లను అరెస్టు చేశారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్‌కు తరలించింది. ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు వర్ధమాన్‌, దయాళ్‌, శుక్రాచారి పరారీలో ఉన్నారు. అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేసిన ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement