చేర్యాల(సిద్దిపేట): స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వాచ్‌మ్యాన్ అల్లం మల్లేశం(54) గురువారం తెల్లవారు జామున పాఠశాల ఆవరణలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. కొమురవెల్లి మండలం మర్రిముచ్చాలకు చెందిన మల్లేశం కొద్దిరోజులుగా స్థానిక గురుకుల పాఠశాలలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో వాచ్‌మ్యాన్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల అస్వస్థతకు గురికావడంతో ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. బుధవారం విధులకు హాజరయ్యాడు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున తాను ఉండే గది నుంచి బయటకు వచ్చి గది ఎదుట రోడ్డుపై అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు. దీంతో విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్ నర్సింహాచారి పోలీసులు, మల్లేశం కుటుంబ సభ్యులకు సమాచారం తెలియజేశారు. పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జి.అపూర్వరెడ్డి తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.


