హత్నూర(సంగారెడ్డి): సమాజంలోని ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య అన్నారు. బుధవారం మండలంలోని కాసాల రైతు వేదికలో నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులు తమకు చట్టపరంగా కల్పించిన హక్కులను తెలుసుకోవాలన్నారు. లోక్ అదాలత్ వంటి ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానాలను వినియోగించుకోవాలని కోరారు. అలాగే విత్తన మేళా ప్రాముఖ్యత గురించి వివరించారు. ఆధునిక సాగు పద్ధతులను అనుసరించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, తహసీల్దార్ పర్వీన్ షేక్, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య


