టూరిజం వలయ ఏర్పాటుకు సన్నాహాలు
మెదక్ అర్బన్: మెతుకు సీమ చారిత్రక, ఆధ్యాత్మిక, వారసత్వ, ప్రకృతి అందాలకు మెరుగులు దిద్ది పర్యాటకులకు కనువిందు చేసేందుకు కలెక్టర్ ప్రతిమాసింగ్ టూరిజం హబ్ పేరిట బృహత్ ప్రణాళికకు రూపకల్పన చేస్తున్నారు. జిల్లాలోని 15 దర్శనీయ స్థలాలను ఎంపిక చేసి పర్యాటక వలయాన్ని తయారు చేసేందుకు కార్యాచరణ ప్రారంభించారు. ఇప్పటికే ఏడుపాయల్లో కాటేజీల నిర్మాణానికి రూ.7 కోట్లు, మెదక్ ఖిల్లా అభివృద్ధికి రూ.57 లక్షలు మంజూరయ్యాయి. ఈనెలలో పర్యాటక కన్సెల్టెంట్ శవంతి గుప్తా, భువన్, పర్యాటక శాఖ అధికారి రమేశ్, ఈడీఎం సందీప్ ఐదు రోజుల పాటు పర్యాటక ప్రదేశాలను పరిశీలించారు. కాగా సినీనటుడు మంచు విష్ణు సైతం ఈ ప్రాంతాల్లో పర్యటించి వాటికి ప్రచారం కల్పించారు.
ఐదు టూరిజం సర్క్యూట్‌లు
● పర్యాటక అందాలకు నెలవైన మెతుకు సీమకు మెరుగులు దిద్దేందుకు మొదటిసారిగా అడుగులు పడుతున్నాయి. మెదక్ జిల్లాలోని 15 పర్యాటక కేంద్రాలను ప్రాథమికంగా ఎంపిక చేశారు. వాటిని 5 సర్క్యూట్‌లుగా విభజించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.
● మెదక్ హెరిటేజ్ సర్క్యూట్: మెదక్ ఖిల్లా, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చర్చి, బారాకమాన్, దయార మెట్లబావి, పాపన్నపేట కోటలు, కోంటూర్ మసీదు, చందంపేట కోట, వెల్దుర్తిలోని కాకతీయ తోరణం.
● ఆలయ టూరిజం సర్క్యూట్: ఏడుపాయల వన దుర్గాభవానీ ఆలయం, కూచాద్రి వేంకటేశ్వర స్వామి ఆలయం, వేల్పుగొండ తుంబురేశ్వర ఆలయం, మడూర్ సోమశేఖర ఆలయం.
● ఎకో టూరిజం సర్క్యూట్: పోచారం వన్యమృగ అడవి, పోచారం షికార్ ఘర్, నర్సాపూర్ అర్బన్ పార్క్.
● హైదరాబాద్ డే ట్రిప్: మెదక్ కెథెడ్రల్ చర్చి, మెదక్ ఖిల్లా, బారా కమాన్, పోచారం వన్యమృగ కేంద్రం.
● కాకతీయ వారసత్వ ట్రయల్: వెల్దుర్తి కాకతీయ తోరణం , మడూరు సోమశేఖర ఆలయం, వేల్పుగొండ తుంబురేశ్వర ఆలయం
జిల్లాలో 15 దర్శనీయ స్థలాల ఎంపిక
ఏడుపాయల్లో కాటేజీల నిర్మాణానికి రూ.7 కోట్లు
మాస్టర్ ప్లాన్ బాధ్యతలు కన్సల్టెన్సీకి..
సినీ హీరోలతో ప్రచార వ్యూహం


