అక్కన్నపేట(హుస్నాబాద్): మండలంలోని గోవర్ధనగిరి గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మందుబాబులకు అడ్డాగా మారింది. బుధవారం ఉదయం పాఠశాలకు వెళ్లిన ఉపాధ్యాయులు వరండాలో పడి ఉన్న బీరు బాటిళ్లు, సిగరెట్‌ను చూసి అవాక్కయ్యారు. రాత్రి కొందరు మందుబాబులు పాఠశాల ఆవరణలోకి ప్రవేశించి మద్యం తాగి, ఖాళీ బాటిళ్లు, సిగరెట్ ముక్కలు అక్కడే వదిలివెళ్లారు. కాగా పాఠశాలకు కూతవేటు దూరంలోనే మద్యం షాపు కొనసాగుతుంది. గతంలో పాఠశాల సమీపంలో ఏర్పాటు చేయొద్దని గ్రామస్తులు వ్యతిరేకించారు. ప్రస్తుతం సంబంధిత ఎకై ్సజ్ శాఖ అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోవడం వెనక పలు అనుమానాలకు దారితీస్తుంది. ఈ ఘటనతో విద్యార్థుల భద్రతతో పాటు పాఠశాల వాతావరణంపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల పరిసరాల్లో రాత్రి పోలీసు నిఘా పెంచడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు.


