● వరుస వర్షాలతో అన్నదాతకు ఊరట ● జీవం పోసుకున్న పత్తి, సోయా, పెసర ● సాధారణ వర్షపాతం జాబితాలోకి జిల్లా
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో రెండు రోజులుగా కురిసిన వర్షం పంటలకు జీవం పోసింది. ఎల్‌నినో హెచ్చరికలతో ఆందోళనలో ఉన్న అన్నదాతలకు కొంత ఊరటనిచ్చింది. దీంతో ఆరుతడి పంటలకు ప్రాణం వచ్చింది. ప్రధానంగా పత్తి, సోయా, పెసర, కంది వంటి పంటలకు ఎంతో మేలు జరిగింది. ఒక కంది మినహ మిగిలిన మూడు పంటలు ప్రస్తుతం గూడ దశలో ఉన్నాయి. వారం రోజుల్లో పూత దశకు చేరుకుంటాయి. ఈ కీలక తరుణంలో వరుణుడు కాస్త కరుణ చూపడంతో ఈ పంటలకు గట్టెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వర్షం పడకపోతే పంటలు ఎండిపోయి.. పెట్టిన పెట్టుబడి కూడా రైతులు నష్టపోయే వారు. ఇప్పుడు కురిసిన వర్షానికి లాభాలు రాకపోయినా, పెట్టుబడి అయినా వస్తుందనే ఆశ కలిగింది.
విస్తీర్ణంలో రాష్ట్రంలోనే మొదటి స్థానం
జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 7.28 లక్షల ఎకరాలు కాగా, ఈనెల 27 వరకు 5.91 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇది రాష్ట్రంలో అత్యధిక విస్తీర్ణం కావడం గమనార్హం. రాష్ట్రంలో ఏ జిల్లాలో ఇంత విస్తీర్ణంలో పంటలు సాగు కాలేదు. అత్యధికంగా 3.56 లక్షల ఎకరాల్లో పత్తి విత్తుకున్నారు. 70,191 ఎకరాల్లో సోయా పంట వేసుకున్నారు. 71,961 ఎకరాల్లో కంది, 7,364 ఎకరాల్లో మక్క, 8,002 ఎకరాల్లో పెసర, 6,250 ఎకరాల్లో శనగ పంట సాగవుతోంది. మరోవైపు 34,249 చెరుకు పంట కొనసాగుతోంది. అయితే బోరుబావుల కింద 19,365 ఎకరాల్లో వరి వేసుకున్నారు. మొత్తంగా రాష్ట్రంలో అత్యధిక విస్తీర్ణంలో పంటలు సంగారెడ్డి జిల్లాలో సాగువుతున్నాయి. రెండు రోజులుగా కురిసిన వర్షాలు ఈ పంటలకు ప్రాణం పోసినట్లయింది. మరోవారం రోజులు వర్షాలు కురియకపోతే ఈ పంటలన్నీ ఎండిపోతుండేవని అన్నదాతలు పేర్కొంటున్నారు.
అత్యధికంగా 7.2 సెం.మీలు
సోమవారం రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లా కేంద్రంలో 7.2 సెం.మీల వర్షపాతం నమోదైంది. కంగ్టిలో 5 సెం.మీలు, సిర్గాపూర్ 5.7 సెం.మీలు, కందిలో 5.2 సెం.మీలు, గుమ్మడిదలలో 4.3 సెం.మీలు, పటాన్‌చెరులో 4.1 సెం.మీలు, ఆర్సీపురంలో 3.9 సెం.మీ వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా సగటున 2.8 సెం.మీల వర్షపాతం రికార్డు కావడం గమనార్హం. శుక్ర, శనివారాల్లో కూడా జిల్లాలోని పలు మండలాల్లో వర్షపాతం నమోదైంది.
వర్షపాతంలో రెండో స్థానం
వర్షాకాలం ప్రారంభమైన జూన్ ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు జిల్లా సాధారణ వర్షపాతం 290 మి.మీ. ఇప్పటి వరకు 271 మి.మీల వర్షం కురిసింది. అంటే సాధారణం కంటే కేవలం ఏడు శాతం.. 19 మి.మీలు మాత్రమే తక్కువ ఉంది. సాధారణం కంటే 20 శాతం తక్కువ గానీ, ఎక్కువ గానీ నమోదైనా సాధారణ వర్షపాతంగానే వాతావరణశాఖ భావిస్తుంది. రంగారెడ్డి జిల్లాలో ఈ రోజు వరకు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత సంగారెడ్డి జిల్లానే రెండో స్థానంలో ఉంది. రాష్ట్రంలో ఏడు మండలాలు సాధారణ వర్షపాతం నమోదైన జిల్లాలు కాగా, అందులో సంగారెడ్డి కూడా ఉంది.


