జహీరాబాద్ టౌన్: సీజన్ కావడంతో మార్కెట్‌లోకి మొక్కజొన్న పొత్తులు భారీ వచ్చాయి. జహీరాబాద్ మార్కెట్‌లో మొక్కజొన్న పొత్తుల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పచ్చి కంకులనే అమ్ముకునేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. గిట్టుబాటు ధర లభిస్తుండటంతో అమ్మకాలు, కొనుగోళ్లతో మార్కెట్ కళకళలాడుతోంది. జహీరాబాద్ వ్యవసాయ డివిజన్‌లో రైతులు మొక్కజొన్న పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. చెరుకులోనూ అంతరపంటగా మొక్కజొన్న సాగు చేస్తుంటారు. గతేడాది కంటే ఈసారి డివిజన్‌లో మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెరిగింది. జహీరాబాద్,న్యాల్‌కల్,మొగుడంపల్లి,కోహీర్,ఝరాసంగం తదితర మండలాల్లో రైతులు గతేడాది 6 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగుచేయగా..ఈ సంవత్సరం సుమారు 10 వేల ఎకరాల్లో పంట సాగవుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. మొక్కజొన్న పంటకు కేంద్రం కనీస మద్దతు ధర ప్రకటించడంతో గిట్టుబాటవుతుందని ఈ పంట సాగుపై మొగ్గు చూపారు. సీజన్ కావడంతో పంట చేతికి వచ్చింది. పట్టణంలోని పశువుల సంత వద్ద గల మార్కెట్‌లో కంకుల అమ్మకాలు జరుగుతుంటాయి. రైతులు పంటను మార్కెట్‌కు తీసుకొని రాగా దళారులు వ్యాపారులకు విక్రయిస్తుంటారు. కంకులను క్వింటాలు లెక్కన అమ్ముతుంటారు. ప్రస్తుతం జహీరాబాద్ మార్కెట్‌లో క్వింటాలు రూ.2,200 వరకు పలుకుతోంది. చిరువ్యాపారులు మార్కెట్‌లో కొనుగోలు చేసి కాల్చిన ఒక్కో కంకిని రూ.20 అమ్ముతున్నారు. పక్కనున్న కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు కూడా కంకులను కొనుగోలు చేస్తున్నారు.
జోరుగా సాగుతున్న అమ్మకాలు
పచ్చి కంకులు అమ్మడానికే రైతుల ఆసక్తి


