నిజాంపేట(మెదక్): మండలంలోని చల్మెడ గ్రామానికి చెందిన ఒక వృద్ధురాలు గరువారం ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. చల్మెడ గ్రామానికి చెందిన అలకుంట వెంకవ్వ(65) గురువారం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరివేసుకుంది. భర్త రెండేళ్ల క్రితం మరణించడంతో అప్పటి నుంచి ఆమె ఒంటరితనంతో బాధపడుతోంది. గతంలో కూడా ఆమె రెండు, మూడు సార్లు ఆత్మహత్యకు యత్నించింది. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. మృతురాలి కుమారుడు స్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ రాజేశ్ తెలిపారు.
మరో ఘటనలో భర్త..
మిరుదొడ్డి(దుబ్బాక): తన భార్య పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందని మనస్తాపం చెందిన ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల కేంద్రమైన మిరుదొడ్డిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ సతీశ్ గురువారం వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. మిరుదొడ్డి గ్రామానికి చెందిన అబ్దుల్ రెహమాన్(చెక్క రవి)(40) ఇదే గ్రామానికి చెందిన ఫర్జానా బేగంను వివాహం చేసుకున్నాడు. మతాలు వేరు కావడంతో రవి ముస్లింగా కన్వెర్టయి అబ్దుల్ రెహమాన్‌గా పేరు మార్చుకున్నాడు. వారికి 15 సంవత్సరాలలోపు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరు కొంత కాలంగా సిద్దిపేటలోని కేసీఆర్‌నగర్ డబుల్‌బెడ్రూం కాలనీలో నివాసం ఉంటున్నారు. ఇటీవల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 20న అబ్దుల్ రెహమాన్ తన భార్యపై దాడిచేశాడు. దీంతో ఆమె సిద్దిపేట రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో మనస్తాపం చెందిన భర్త తన స్వగ్రామమైన మిరుదొడ్డికి చేరుకుని గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


