నాచారం ఆలయం వద్ద బాల్యవివాహం | - | Sakshi
Sakshi News home page

నాచారం ఆలయం వద్ద బాల్యవివాహం

Jul 24 2026 7:19 AM | Updated on Jul 24 2026 7:19 AM

వర్గల్‌(గజ్వేల్‌): వర్గల్‌ మండలం నాచారం ఆలయం వద్ద గురువారం బాల్యవివాహం చేసుకున్న వారిని గుర్తించి యాదాద్రి భువనగిరి సీడబ్ల్యూసీకి అప్పగించినట్లు బాల్యవివాహ నిరోధక అధికారులు(సీఎంపీఓ) తెలిపారు. నాచారం గుట్ట అవుట్‌పోస్టు పోలీస్‌స్టేషన్‌ వద్ద సీఎంపీఓ అధికారులు రాజు, గణేశ్‌, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ సునీత వివరాలు వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలానికి చెందిన రెండు కుటుంబాలు నాచారం లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద బాల్యవివాహం జరుపుతున్నట్లు చైల్డ్‌ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందింది. వెంటనే బాల్య వివాహ నిరోధక అధికారులు, జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారులు, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌(1098) సిబ్బంది అక్కడికి చేరుకుని బాల్యవివాహంపై ఆరా తీశారు. వారు చేరుకునేలోపే బాల్య వివాహం జరిగినట్లు గుర్తించారు. వధూవరులు 18 సంవత్సరాల లోపు బాలబాలికలే అని నిర్ధారించారు. అనంతరం వారిని జిల్లా బాలల సంక్షేమ సమితి ఎదుట హాజరుపరిచారు. వారి ఆదేశాల మేరకు భద్రత, రక్షణ, తదుపరి సంరక్షణ కోసం సంబంధిత యాదాద్రి భువనగిరి జిల్లా బాలల సంక్షేమ సమితికి బదిలీ చేసి వారిని అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ఎక్కడైనా బాల్యవివాహం జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ 1098కు సమాచారం అందించాలని కోరారు. బాలల బంగారు భవిష్యత్తును కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని సూచించారు.

చైల్డ్‌ హెల్ప్‌లైన్‌కు సమాచారం

అధికారుల విచారణ

యాదాద్రి భువనగిరి సీడబ్ల్యూసీకి అప్పగింత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement