రాష్ట్రంలోనే అత్యధికంగా 11.4 సెం.మీ రికార్డు ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలు మండలాల్లో వాన
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఉమ్మడి మెదక్ జిల్లాలో శనివారం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల కేంద్రంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 11.4 సెం.మీల వర్షపాతం రికార్డు అయింది. దీంతో వాతావరణశాఖ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. శనివారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఉమ్మడి జిల్లాలో వివిధ చోట్ల నమోదైన వర్షపాతం వివరాలను పరిశీలిస్తే.. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం దామరంచలో 4.7 సెం.మీలు, పుల్కల్ 3.4 సెం.మీలు, మునిపల్లిలో 3.2 సెం.మీలు, రామచంద్రాపూరం బీహెచ్‌ఈఎల్‌లో 3.0 సెం.మీలు, సదాశివపేటలో 2.3 సెం.మీలు, రాయికోడ్, న్యాల్‌కల్ మండలాల్లో 1.5 సెం.మీల చొప్పున వర్షపాతం రికార్డు అయింది. జిల్లావ్యాప్తంగా దాదాపు అన్ని మండలాల్లో వర్ష పాతం రికార్డు అయింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి వరకు ముసురు పెట్టింది. అలాగే పటాన్‌చెరు, తెల్లాపూర్, అమీన్‌పూర్‌లలో విస్తారంగా వర్షాలు కురిశాయి. భారీ వర్షాలకు విద్యుత్ సరఫరాకు తరచూ అంతరాయం ఏర్పడగా, మరోవైపు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
న్యాల్‌కల్(జహీరాబాద్): జిల్లాలో శనివారం కురిసిన భారీ వర్షంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. వర్షం వల్ల వేసిన పంటలకు ప్రాణం పోసినట్లు కాగా, వేసే పంటలకు పరిస్థితులు అనుకూలంగా మారడంతో రైతుల్లో సంతోషం వ్యక్తం అవుతోంది. ఈ ఏడాది 7,62,580 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అత్యధికంగా 3,82,511 ఎకరాల్లో పత్తి, 1,59,070 ఎకరాల్లో వరి, 75,557 ఎకరాల్లో కంది, 61,312 ఎకరాల్లో సోయాబీన్, 27,986 ఎకరాల్లో చెరకు, 56,144 ఎకరాల్లో ఇతర పంటలు సాగయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. అధికంగా పత్తి విత్తనాలను విత్తారు. ముందుగా విత్తుకున్న విత్తనాలు సైతం మొలకెత్తాయి. ఈ నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో వర్షాలు కురవకపోడంతో మొలకెత్తిన పంట దెబ్బతింటుంది. దీంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. బోరు బావులు ఉన్న రైతులు స్ప్రీంకర్ల ద్వారా పంటలకు నీటి తడులు అందిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం నుంచి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో సాగు చేసుకున్న పంటలకు ప్రాణం పోసినట్లయింది. పంటలు వేసుకునేందుకు వాతావరణం అనుకూలంగా ఉండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


