3న సీఎం రేవంత్ రాక
కొన్యాల– చౌటకూర్ లింకు రోడ్డు దుస్థితి
దశాబ్దాలుగా నలుగుతున్నదౌల్తాబాద్ – కాసాల శివారు పంచాయితీ
మట్టిరోడ్డుపై
తీవ్ర ఇబ్బందులు
బోరపట్లకు రానున్న సీఎంపైనే ప్రజల ఆశలు
మండలానికి సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 3న రానుండడంతో మండలంలోని దశాబ్దాల నాటి సమస్యలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. గతంలో ఇద్దరు సీఎంలు పర్యటించినా తీరని సమస్యలు.. ఇప్పుడు మూడో సీఎం రాకతోనైనా పరిష్కారమవుతాయా అని స్థానిక ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. హత్నూర (సంగారెడ్డి)
కాసాల–దౌల్తాబాద్ గ్రామాల సరిహద్దు సమస్య దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. స్వర్గీయ మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ’రాజీవ్ పల్లె బాట’ బస్సు యాత్రలో దౌల్తాబాద్ మీదుగా వెళ్లినప్పుడు రెండు గ్రామాల ప్రజలు ఈ శివారు సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అప్పట్లో పరిష్కారం లభించకపోవడంతో ఇప్పటికీ తరచూ రెండు గ్రామాల మధ్య ఘర్షణలు నెలకొంటున్నాయి. ఆ తర్వాత మాజీ సీఎం కేసీఆర్ సైతం నర్సాపూర్ బహిరంగ సభలో దౌల్తాబాద్, కాసాలను కలిపి మున్సిపాలిటీగా మారుస్తామని ప్రకటించినా.. నేటికీ కార్యరూపం దాల్చలేదు. ఫలితంగా తరచూ తై బజార్ వసూళ్లు, వ్యాపార సంస్థల అనుమతులు, ఇతర సౌకర్యాల విషయంలో వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి రాకతోనైనా ఈ పంచాయితీకి శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఇరు గ్రామాల ప్రజలు భావిస్తున్నారు.
కొన్యాల – చౌటకూర్ లింక్ రోడ్డు దుస్థితి
కొన్యాల గ్రామ శివారులోని మంజీరా నదిపై స్వర్గీయ వైఎస్సార్ హయాంలోనే బ్రిడ్జి నిర్మాణం పూర్తయినప్పటికీ, కొన్యాల–చౌటకూర్ లింక్ రోడ్డు నిర్మాణానికి ఇప్పటివరకు నిధులు మంజూరు కాలేదు. దీంతో వాహనదారులు మట్టిరోడ్డుపై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డు పూర్తయితే జోగిపేటకు వెళ్లే ప్రజలకు ప్రయాణ దూరం భారీగా తగ్గనుంది. మరోవైపు సంగారెడ్డి నుంచి భువనగిరి వరకు నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ అనేది కేవలం కలగానే మిగిలిపోయింది. మండలంలోని పలు గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులన్నీ గుంతలమయంగా మారి ధ్వంసమయ్యాయి.
పెరిగిన నిరుద్యోగం..
కాలుష్య కోరల్లో మంజీరా
హత్నూర మండలంలో 16 భారీ పరిశ్రమలు ఉన్నప్పటికీ, స్థానిక యువతకు ఉపాధి దక్కడం లేదు. స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని నిరుద్యోగు లు పలుమార్లు ఆందోళనలు చేపట్టినా యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. అంతేకాదు, ఈ పరిశ్రమలు వెదజల్లుతున్న రసాయన కాలుష్యంతో నక్కవాగు, మంజీరా పరివాహక ప్రాంతాలు పూర్తిగా కలుషితమైపోతున్నాయి. విషపూరిత జలాలతో మూగజీవాలు, వాగులోని చేపలు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. ఈ కాలుష్య జలాలు నక్కవాగులో కలవకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
మార్కెట్ యార్డుగా దౌల్తాబాద్ ఉప మార్కెట్
ప్రస్తుతం ఉన్న దౌల్తాబాద్ ఉప మార్కెట్ యార్డును పూర్తిస్థాయి మార్కెట్ యార్డ్‌గా అప్‌గ్రేడ్ చేసి, దానికి ప్రత్యేక పాలకమండలిని ఏర్పాటు చేయాలని స్థానిక రైతు నాయకులు పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారు. జూన్ 3న సీఎం రేవంత్ రెడ్డి మండల పరిధిలోని బోరపట్లకు రానున్న నేపథ్యంలో ఈ దీర్ఘకాలిక సమస్యలన్నింటికీ సీఎం సానుకూల నిర్ణయంతో మోక్షం కలిగిస్తారని మండల ప్రజలు గంపెడు ఆశలతో ఎదురుచూస్తున్నారు.


