స్వచ్ఛ గౌవ్‌పై అవగాహన | - | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ గౌవ్‌పై అవగాహన

Jun 2 2026 7:40 AM | Updated on Jun 2 2026 7:40 AM

పటాన్‌చెరు టౌన్‌: మండల పరిధిలోని నందిగామ రైతు వేదికలో స్వచ్ఛ గౌవ్‌. సురక్ష జల వాయు కార్యక్రమంలో భాగంగా సోమవారం గూగుల్‌ మీట్‌ ద్వారా మండల స్థాయి అవగాహన కార్యక్రమాన్ని కలెక్టర్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, వ్యర్థాల వేరు చేయడం, సేకరణ, శాసీ్త్రయ నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ చర్యలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ యాదిగిరి, మండల పంచాయతీ అధికారి హరిశంకర్‌ గౌడ్‌, సర్పంచ్‌లు విక్రమ్‌ గౌడ్‌, శాంతయ్య, సంగీత, పంచాయతీ కార్యదర్శి రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో

విలీనం చేయాలని నిరసన

నారాయణఖేడ్‌: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ సోమవారం ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు నిరసన తెలిపారు. ఈ మేరకు ఎర్ర బ్యాడ్జిలు ధరించి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు వద్దు.. విలీనమే ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డిపో జేఏసీ ఛైర్మన్‌ నెహ్రూ మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేది కార్మికుల దశాబ్దాల కల అని తెలిపారు. సంఘం ఎన్నికల కన్నా కార్మికుల సంక్షేమమే ముఖ్యమని తెలిపారు. ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల నిరంతర శ్రమకు గుర్తింపునివ్వాలని కోరారు. జేఏసీ ఇతర బాధ్యులు బీఎన్‌ రెడ్డి, బీరప్ప, రాజు, కార్మికులు పాల్గొన్నారు.

నాలాలపై నిర్లక్ష్యం తగదు

జహీరాబాద్‌ టౌన్‌: పట్టణంలోని 27వ వార్డులో నాలాలపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని కౌన్సిలర్‌ స్రవంతి ఆరోపించారు. ఈ సందర్భంగా సోమవారం నాలాలను పరిశీలించి మాట్లాడారు. పట్టణంలోని బాగారెడ్డిపల్లి నుంచి వచ్చే పెద్ద నాలా 27వ వార్డులో ప్రవహిస్తుందన్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో నాలా పూర్తిగా చెత్తతో నిండిపోయిందన్నారు. వేసవిలో ఇరిగేషన్‌, మున్సిపల్‌ అధికారులు కలిసి నాలాను శుభ్రం చేస్తుండగా.. గత ఏడాది నుంచి ఎవరూ పట్టించుకోవడంలేదన్నారు. వర్షాకాలంలో నాలా పొంగి మురుగుంతా ఇళ్లలోకి వస్తుందన్నారు. కొంత మంది నాలాను కబ్జాచేసి నిర్మాణాలు చేపట్టారన్నారు. అధికారులు స్పందించి చెత్తతో పాటు అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆమె కోరారు.

బస్సు సౌకర్యం

కల్పించాలని వినతి

పటాన్‌చెరు టౌన్‌: ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని రామేశ్వరంబండ, వీకర్‌ సెక్షన్‌ కాలనీ, బచ్చుగూడకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని సోమవారం మియాపూర్‌ డిపో మేనేజర్‌ సుధను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయా కాలనీవాసులు మాట్లాడుతూ నిత్యం వందలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు మియాపూర్‌, పటాన్‌చెరు తదితర ప్రాంతాలకు ప్రయాణిస్తున్నప్పటికీ, నేరుగా బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆటోలపై ఆధారపడాల్సి వస్తోందన్నారు. దీంతో ప్రయాణ ఖర్చులు పెరగడంతో పాటు సమయం వృథా అవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

బాధితులకు

అండగా ఉంటాం

జిన్నారం (పటాన్‌చెరు): ప్రభుత్వం నిరుపేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను అక్రమంగా కబ్జా చేస్తున్నారని కిష్టయ్యపల్లి భూ బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. గడ్డపోతారం పట్టణ పరిధిలోని కిష్టయ్యపల్లి సర్వేనెంబర్‌ 42లో గతంలో ప్రభుత్వం 91 మంది నిరుపేదలకు ఇళ్లస్థలాలను కేటాయిస్తూ పట్టాలను అందజేసిందన్నారు. ప్రస్తుతం ఆ భూములను ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కొంతమంది ఆ స్థలంలో కంచెను వేశారని బాధితులు కౌన్సిలర్‌ ఇంద్రసేన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఇంద్రసేన మాట్లాడుతూ భూ బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి నిరుపేదలకు భూములు దక్కే విధంగా కృషి చేస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement