సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తెలంగాణ ఆవిర్బావం అనంతరం సంగారెడ్డి జిల్లా ప్రగతి వైపు పరుగులు తీస్తోంది. ప్రధానంగా పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతోంది. ఔషధ, బల్క్‌డ్రగ్, కెమికల్, మాన్‌ఫ్యాక్చరింగ్ తదితర రంగాలకు సంబంధించి జిల్లాలో భారీ, మధ్యతరహా పరిశ్రమల స్థాపన కొనసాగుతోంది. పటాన్‌చెరు ప్రాంతంలో ఏర్పాటు చేసిన సుల్తాన్‌పూర్ మెడికల్ డివైజ్ పార్కులో ఉత్పత్తి అవుతున్న వైద్య పరికరాలు దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు, విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. గుండెకు వేసే స్టెంట్లు, రోగ నిర్ధారణ పరీక్షలకు అవసరమయ్యే కిట్లు, ఆపరేషన్ థియేటర్లలో వాడే పరికరాలు, క్యాథెటర్లు, దంతాలకు సంబందించిన ఇంప్లాంట్లు, ఆర్థో, కంటి వైద్య పరికరాలు, కరోనా వంటి ఆపత్కాళంలో అవసమైన కిట్లు వంటివి ఈ పార్కులోని పరిశ్రమల్లో ఉత్పత్తి అవుతున్నాయి. 2017లో ఏర్పాటైన ఈ పార్కుతో స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగు పడటంతో పాటు, వైద్య పరికరాల రంగంలో పరిశోధనలకు కూడా బాటలు పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న నిమ్జ్‌లో జహీరాబాద్ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధికి బాటలు పడుతున్నాయి. వెమ్ టెక్నాలజీ వంటి పరిశ్రమల రాకతో యుద్ధాల్లో వినియోగించే డ్రోన్‌లు వంటి రక్షణ రంగ ఉత్పత్తుల పరిశ్రమలు ఈ నిమ్జ్‌లో కొలువుదీరనున్నాయి.
ఆ రెండు జాతీయ రహదారులు
నాందేడ్–అకోలా జాతీయ రహదారి నిర్మాణంతో జిల్లా దశ దిశ మారుతోంది. మహారాష్ట్రలోని ఉత్తరాది ప్రాంతానికి అనుసంధానిస్తూ సుమారు 430 కి.మీ.ల పొడవున్న ఈ రహదారి జిల్లాలో సుమారు 70 కి.మీ వరకు ఉంటుంది. భారత్ మాలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్మించిన ఈ జాతీయ రహదారిని ప్రధాని నరేంద్రమోదీ జాతికి అంకితం చేశారు. కంది నుంచి నిజాంపేట్ మండలం వరకు ఉంది. పరిశ్రమల్లో తయారైన ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ఈ రహదారి ఎంతో కీలకంగా మారింది. జిల్లా పారిశ్రామికంగానే కాకుండా, వ్యవసాయ పరంగా అభివృద్ధికి బాటలు వేసింది. మరోవైపు ముంబై హైవే ప్రాంతం కూడా వాణిజ్య పరంగా అభివృద్ధి చెందింది.
అందుబాటులోకి ఉన్నత వైద్యం
సంగారెడ్డిలో ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణంతో జిల్లాలోని నిరుపేద ప్రజలకు ఉన్నత వైద్యం చేరువైంది. మెడికల్ కాలేజీకి అనుబంధంగా ప్రభుత్వ ఆసుపత్రిని 500 పడకలకు అప్‌గ్రేడ్ అయింది. 2022–23 విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఆయా విభాగాల్లో ప్రత్యేక వైద్య నిపుణుల నియామకంతో అనుబంధ ఆసుపత్రిలో ఉన్నత వైద్య సదుపాయం అందుతోంది. అనుబంధంగా నర్సింగ్ కళాశాల కూడా మంజూరు కావడంతో జిల్లా వాసులు ఈ కోర్సుల్లో చేరేందుకు అవకాశం లభించింది.
సంగారెడ్డిలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల
161 జాతీయ రహదారి
161 జాతీయ రహదారి నిర్మాణంతో అభివృద్ధికి బాటలు
మెడికల్ కళాశాల ఏర్పాటుతో చేరువైన ఉన్నత వైద్యం
తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రగతి దిశగా పయనం
నెరవేరని సాగునీటి ఆకాంక్షలు


