కలెక్టర్‌కు మంత్రి దామోదర ఆదేశం
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ డివిజన్ పరిధిలో మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్ర ఫౌండేషన్‌కు అప్పగించవద్దని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్‌కు ఫోన్ చేశారు. కొన్నేళ్ల నుంచి పనిచేస్తున్న తమను అకస్మాత్తుగా తొలగిస్తే ఎలా బతకాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికులు కాంగ్రెస్ నేతలు ఉజ్వల్‌రెడ్డిని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఆయన మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి వెంటనే ఫోన్‌లో కలెక్టర్‌తో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో మహిళా సంఘాల సభ్యులతోనే వంటలు చేయించాలని, అక్షయ పాత్రకు అప్పగించరాదని ఆదేశించారు.
సీఎం రాక కోసం ఏర్పాట్లు
హత్నూర(సంగారెడ్డి): ఈనెల 3న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హత్నూర మండలం బోరపట్లకు రానున్న నేపథ్యంలో అధికారులు సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ అధికారులు, ఆర్డీవో రాజేందర్, డీఎస్పీ ప్రభాకర్, రెవెన్యూ, పోలీసులు హెలిప్యాడ్, సభాస్థలిని క్షుణ్ణంగా పరిశీలించారు. పరిశ్రమ ప్రతినిధులతో మాట్లాడారు. అయితే సీఎం పర్యటనపై సందిగ్ధం నెలకొంది. రేవంత్‌రెడ్డి వస్తారా.. లేదా వర్చువల్‌గా పరిశ్రమను ప్రారంభిస్తారా అనేది సస్పెన్స్‌గానే ఉంది.
జీలుగు కోసం
ఎగబడిన రైతులు
హత్నూర(సంగారెడ్డి): పచ్చి రొట్టె ఎరువుల (జీలుగు) కోసం రైతులు ఎగబడ్డారు. సోమవారం రైతు వేదిక వద్ద 450 క్వింటాళ్ల జీలుగు (1500 బస్తాలు) 30 క్వింటాళ్ల జనుము (75 బస్తాలు) వచ్చినట్లు మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. మూడు క్లస్టర్లలో వీటిని రైతులకు అందించనున్నట్లు తెలిపారు. ఒక్కసారిగా రైతులు జీలుఉ జిలుగుల కోసం ఎగబడటంతో రైతు వేదికల వద్ద గందరగోళం నెలకొంది. అవసరం ఉన్న మేరకు ఇంకా జిలుగులు తెప్పిస్తామని వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు.
కొనుగోలు కేంద్రాల్లో
బయోమెట్రిక్ తొలగించాలి
బీకేఎస్ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి
సంగారెడ్డిటౌన్: జొన్నల కొనుగోలు కేంద్రాల్లో బయోమెట్రిక్ విధానాన్ని తొలగించాలని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కార్యాలయంలో రైతులతో నిర్వహించిన సమా వేశంలో ఆయన మాట్లాడారు. జొన్నల కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని ఖరీఫ్ సీజన్‌లో రైతులకు యూరియా అందుబాటులో ఉంచాలన్నారు. నకిలీ విత్తనాలు వల్ల రైతులు నష్టపోకుండా జిల్లా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణారెడ్డి, రైతులు సంఘం నాయకులు పాల్గొన్నారు.
3న జిల్లా స్థాయి వక్తృత్వ,
వ్యాసరచన పోటీలు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 99 రోజుల ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక‘ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో ఈ నెల 3న జిల్లా స్థాయి వక్తృత్వ, వ్యాసరచన పోటీలను సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ ప్రవీణ్, జిల్లా పర్యావరణ ఇంజనీర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి ఎన్. విజయలక్ష్మి ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ, ఘన వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై అవగాహన పెంపొందించేందుకు ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఇంటర్మీడియెట్, డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులందరూ ఈ పోటీల్లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు.


