సంగారెడ్డి జోన్: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతఅని కలెక్టర్ ప్రతిక్ జైన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన, ప్రగతి నివేదికలో భాగంగా ఈనెల 12 వరకు నిర్వహించే పర్యావరణ వారోత్సవాలను పురస్కరించుకొని సోమవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యా సంస్థలలో క్విజ్ పోటీలు, పర్యావరణ అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. యువత, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల భాగస్వామ్యంతో అవగాహన సదస్సులు, ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వనమహోత్సవం, అధిక సాంద్రతతో మిశ్రమ మొక్కల నాటకం, గృహావసర మొక్కల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మంజీరా వన్యప్రాణి అభయారణ్యం, కమలాపూర్ సరస్సు ప్రాంతాల్లో ప్రకృతి సందర్శన కార్యక్రమాలు, స్వయం సహాయక సంఘాల ద్వారా పర్యావరణ హిత ఉత్పత్తులపై అవగాహన కార్యక్రమాలు ఉంటాయన్నారు. 12న జరిగే ముగింపు సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు సేవలందించిన స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, పాఠశాలలకు, వ్యక్తులకు అవార్డులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నిషేధం కోసం కృషి చేస్తామని అధికారులు, సిబ్బందితో కలిసి కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, అధికారులు పాల్గొన్నారు.
ప్రజావాణిలో 73 అర్జీలు
ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి వివరాలు తెలుసుకుని, పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు సూచనలు చేశారు. కలెక్టరేట్‌లో 38, సంగారెడ్డి డివిజనన్‌కు 05, ఆందోల్ 01, నారాయణఖేడ్ 9, జహీరాబాద్ 20 అర్జీలు అందాయి.
కలెక్టర్ ప్రతీక్ జైన్
12 వరకు పర్యావరణ వారోత్సవాలు


