పటాన్‌చెరును ప్రగతిబాట పట్టిస్తా | - | Sakshi
Sakshi News home page

పటాన్‌చెరును ప్రగతిబాట పట్టిస్తా

Jun 2 2026 7:34 AM | Updated on Jun 2 2026 7:34 AM

పటాన్‌చెరు: నియోజకవర్గాన్ని ప్రగతిబాట పట్టిస్తానని, అందులో భాగంగానే జాతీయ రహదారి నుంచి అమీన్‌పూర్‌కు నేరుగా వెళ్లేందుకు నాలాపై బ్రిడ్జ్డి నిర్మాణానికి నిధులు మంజూరుకావడమేకాక.. పనులు కూడా ప్రారంభమయ్యాయని మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో అమీన్‌పూర్‌ ప్రజలు బ్రిడ్జి, రోడ్డు నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారని చెప్పారు. ఈ క్రమంలో లింగంపల్లి చౌరస్తాలో జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. అక్కడే ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొన్ని నెలల క్రితం అప్పటి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కర్ణన్‌ను ఇక్కడకు రప్పించి ఈ ప్రాంతంలో రోడ్డు ఆవశ్యకతను వివరించానని గుర్తు చేశారు. ఆ తర్వాతే జీహెచ్‌ఎంసీ అధికారులు రూ.3.5 కోట్లు కేటాయించి నిధులను మంజూరు చేశారన్నారు. అమీన్‌పూర్‌కు నేరుగా రోడ్డు కావాలని స్థానికులు చాలా ఏళ్లుగా డిమాండ్‌ చేస్తున్నారన్నారు. లింగంపల్లి జంక్షన్‌ వద్ద ఉన్న కాల్వపై బ్రిడ్జి నిర్మించి నేరుగా శ్రీదేవి థియేటర్‌ వైపు ఉన్న రోడ్డునకు కలపాలని ఆయన సూచించారు. పటాన్‌చెరు ప్రజల ఆశీస్సుల వల్లే తాను ఎంపీగా గెలిచానని, అభివృద్ధి చేపడుతూ ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానని ఆయన వివరించారు. అలాగే ముత్తంగి, కిష్టారెడ్డిపేట వద్ద ఔటర్‌ సర్వీసు రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తామన్నారు.

సాకి చెరువు అభివృద్ధికి కృషి

పటాన్‌చెరు నియోజకవర్గంలోని ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ తెలిపారు. సాకి చెరువు అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి, పార్టీ నాయకులు రవియాదవ్‌, మహిపాల్‌రెడ్డి, నర్సింగ్‌ గౌడ్‌ పాల్గొన్నారు.

ప్రధాన సమస్యల పరిష్కారమే లక్ష్యం

ఈ ప్రాంత ప్రజల ఆశీస్సుల వల్లే

ఎంపీగా గెలిచా

ఎంపీ రఘునందన్‌రావు

Advertisement
 
Advertisement
Advertisement