● రోడ్డు ప్రమాదంలో నర్సింగ్ విద్యార్థిని మృతి
● బైక్‌ను ఢీకొట్టిన లారీ
కల్వర్టును ఢీకొట్టడంతో లారీ డ్రైవర్..
చేర్యాల(సిద్దిపేట): లారీ అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ అపూర్వరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా అడవిటక్కలపాడుకు చెందిన షేక్ మౌలాలి(51), కరీముల్లా ఇద్దరు గుంటూరు నుంచి సిరిసిల్లకు లారీలో సబ్బులు, సర్పులు లోడు చేసుకుని వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున మండల పరిధిలోని వీరన్నపేట గ్రామశివారులోకి రాగానే వాహనం నడుపుతున్న మౌలాలి నిద్రమత్తులోకి జారుకున్నాడు. దీంతో లారీ అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టి కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో కరీముల్లా లారీలో నుంచి కిందకు దూకాడు. కాగా డ్రైవర్ ముందు ఉన్న అద్దం పగిలి మౌలాలి కిందపడగా అతడిపై లారీ క్యాబిన్ పడి అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన కరీముల్లాను ఆస్పత్రికి తరలించారు.
ఉమ్మడి జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందగా.. ఇద్దరు గాయపడ్డారు. అందోల్ మండల పరిధిలో బీఎస్సీ నర్సింగ్ విద్యార్థి, చిన్న కోడూరు మండలంలో యువకుడు, చేర్యాలలో లారీ డ్రైవర్, నారాయణఖేడ్ పరిధిలో ఒకరు మృతి చెందారు. వివరాలు ఇలా...
వట్‌పల్లి(అందోల్): రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం చెందింది. ఈ ఘటన అందోల్ మండల పరిధిలోని కన్‌సాన్‌పల్లి గ్రామ శివారులో నాందేడ్ –అకోలా జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. జోగిపేట ఎస్‌ఐ పాండు కథనం ప్రకారం... అల్లాదుర్గ్ మండలం మందాపూర్ గ్రామానికి చెందిన పాముల స్రవంతి(20) హైదరాబాద్‌లోని బాచుపల్లి నర్సింగ్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. పరీక్షలు రాసేందుకు ఆదివారం ఉదయం తన మేనబావ వరాల సాయితో కలిసి బైక్‌పై కళాశాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో కన్‌సాన్‌పల్లి గ్రామ శివారులో నాందేడ్ జాతీయ రహదారిపై వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో స్రవంతి బైక్ పైనుంచి కింద పడిపోగా లారీ ఆమె తలపై నుంచి దూసుకెళ్లడంతో తల నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతి చెందింది. కాగా సాయికి స్వల్ప గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న వ్యక్తులు లారీని వెంబడించి, ఫొటోలు తీసి పోలీసులకు సమాచారం అందించారు. విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకొని విగతజీవిగా పడి ఉన్న స్రవంతిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఎస్‌ఐ పాండు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లారీతోపాటు డ్రైవర్ జగదీష్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.
లారీ, బైక్ ఢీకొని యువకుడు..
చిన్నకోడూరు(సిద్దిపేట): రోడ్డు ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని రామునిపట్ల శివారులో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని ఇబ్రహీంనగర్ గ్రామానికి చెందిన కావటి మల్లయ్య, లక్ష్మి దంపతులకు కుమారుడు ఎల్లం(31), కూతురు రేణుక ఉన్నారు. ఇద్దరి వివాహం జరిపించారు. కాగా ఎల్లం భార్య రెండేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుంది. ఎల్లం ప్రైవేటు ఉద్యోగం చేస్తూ సిద్దిపేటలో ఉంటున్నాడు. గ్రామంలో జరుగుతున్న పోచమ్మ బోనాల పండుగకు వచ్చాడు. పండుగ సామాను తేవడానికి ఉదయం 6 గంటలకు బైక్‌పై సిద్దిపేటకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో రామునిపట్ల శివారులోకి రాగానే అతివేగంగా వచ్చిన లారీ వెనుకనుంచి బైక్‌ను ఢీకొట్టడంతో ఎల్లం అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ చంద్రమోహన్ అక్కడికి చేరుకొని మృతదేహాన్ని సిద్దిపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా ఉన్న ఒక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు.
లారీ ఢీకొట్టడంతో ఒకరు..
నారాయణఖేడ్: రోడ్డు ప్రమాదంలో తండ్రి మరణించగా, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంపేట్‌కు చెందిన దుర్గయ్య (60) తన కుమారుడు దుర్గేశ్‌తో కలిసి బైక్‌పై బాన్సువాడ వైపు వెళ్తున్నాడు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం పోతిరెడ్డి శివారులో వేగంగా వచ్చిన లారీ వెనుకనుంచి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దుర్గయ్య అక్కడికక్కడే మరణించగా, తీవ్ర గాయాలపాలైన దుర్గేశ్‌ను స్థానికులు బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చే స్తున్నారు.


