అసైన్డ్‌పై రియల్‌ కన్ను | - | Sakshi
Sakshi News home page

అసైన్డ్‌పై రియల్‌ కన్ను

Jun 1 2026 7:35 AM | Updated on Jun 1 2026 7:35 AM

ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు కబ్జా

కొండాపూర్‌(సంగారెడ్డి): అసైన్డ్‌ భూములు కనిపిస్తే చాలు అక్రమార్కులు పంజా విసురుతున్నారు. ఏదో ఒక సాకుతో ఆ భూములను ఆక్రమిస్తున్నారు. భూములకు ధరలు కోట్లలో పలుకుతుండడంతో రాజకీయ నాయకుల అండదండలతో అధికారులకు సైతం కొంత ముట్టజెప్పి కాజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా కాపాడాల్సిన అధికారులు అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అసైన్డ్‌ భూముల్లో అక్రమార్కుల పాగా..

మండల పరిధిలోని కుతుబ్‌షాహీపేటలో సర్వే నం.16లోని రెండెకరాల అసైన్డ్‌ భూముల్లో ఓ అక్రమార్కుడు ఏకంగా బోరు వేసి తన పరిశ్రమకు సంబంధించిన వాహనాలు వెళ్లేలా రోడ్డును ఏర్పాటు చేశాడు. అలాగే అక్కడే ఉన్న ఓ పరిశ్రమకు ఆనుకొని ప్రహరీ గోడనూ సైతం నిర్మించాడు. అలాగే సర్వే నం.20లో సుమారు 30 ఎకరాల అసైన్డ్‌ భూమి ఉంది. ఆ భూములకు ఆనుకొని ఉన్న ఓ వెంచర్‌కు వెళ్లేందుకు రోడ్డు నిమిత్తం ఆ రైతులకు అధిక మొత్తంలో డబ్బులు ఆశ జూపి వాటిని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన రెండెకరాల భూమిని అధికారులకు మాముళ్లు ముట్టజెప్పి రిజిస్ట్రేషన్‌ కూడా చేసుకున్నట్లు సమాచారం. సాధారణ రైతులకు అమ్ముకునేందుకు ఎన్‌ఓసీ ఇవ్వని అధికారులు రియల్‌ వ్యాపారులకు ఎలా ఇచ్చారని రైతులు ప్రశ్నిస్తున్నారు.

సైదాపూర్‌లో ఆక్రమించి కౌలుకు..

మండల పరిధిలోని సైదాపూర్‌ గ్రామంలో ఓ వ్యక్తి తన భూమి పక్కనే ఉన్న సర్వే నం.15లో రెండెకరాల అసైన్డ్‌ భూమిని ఆక్రమించి ఇతరులకు కౌలుకు ఇచ్చాడు. ప్రస్తుతం ఆ భూమిలో బోరు వేయడంతో పాటు జొన్న పంటను కూడా సాగు చేస్తున్నాడు. ఈ అసైన్డ్‌ భూమి గ్రామానికి కూతవేటు దూరంలోనే ఉన్న రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అసైన్డ్‌ భూమిలో ఏర్పాటు చేసిన బోరు

కుతుబ్‌షాహీపేట సర్వే నం.16లో ఆక్రమించిన అసైన్డ్‌ భూమిలో ఏర్పాటు చేసిన రోడ్డు

వక్ఫ్‌ భూములతో దందా!

వక్ఫ్‌ భూములనూ వదలని ఘనులు

పట్టించుకోని రెవెన్యూ అధికారులు

మండల పరిధిలోని సైదాపూర్‌ తండాలో గతంలో ప్రభుత్వం గిరిజనులకు సర్వే నం.78లో 197 ఎకరాల 32 గుంటల భూమిని అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు ప్రభుత్వం పంపిణీ చేసింది. ధరణి వచ్చిన తరువాత ఆ భూములు వక్ఫ్‌ బోర్డుకు సంబంధించినవని తేలాయి. ఇదే అదనుగా భావించిన రియల్‌ వ్యాపారులు ఎకరాకు రూ.27 లక్షల చొప్పున చెల్లించి, ఆ భూములను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే సుమారు 40 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రభుత్వ భూములున్న కొండాపూర్‌, మాందాపూర్‌, మునిదేవునిపల్లి, మల్లెపల్లి తదితర గ్రామాల్లోనూ రైతుల నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేస్తూ వారిని మోసం చేస్తున్నారని వాపోతున్నారు. ఇప్పటికై నా రెవెన్యూ అధికారులు అసైన్డ్‌ భూములను పరిరక్షించడంతోపాటు పాటు అమ్మకాలు, కొనుగోళ్లను నివారించి రైతులను కాపాడాలని కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement