శివంపేట ప్రభుత్వ బడిలో సమ్మర్ క్యాంప్
సంగారెడ్డి: సమ్మర్ వచ్చిందంటే చాలు విద్యార్థులకు ఎనలేని ఆనందం, సంతోషం. సెలవుల్లో టీవీలకు, ఫోన్లకు దూరంగా ఉండేందుకు సెలవులను ఉపయోగకరంగా, సృజనాత్మకంగా మలచాలనే ఉద్దేశంతో చౌటకూర్ మండలంలోని శివ్వంపేట పరిషత్ ఉన్నత పాఠశాలలో సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నారు. క్యాంపులో ఆటలు, యోగా, మెమొరీ గేమ్స్, క్రీడా కార్యక్రమాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. యోగాసనాలు, వ్యాయామాలు, గ్రూప్ యాక్టివిటీస్, సంగీతం, సైన్స్ ప్రయోగాలు, క్విజ్ పోటీల్లో విద్యార్థులు ఆకట్టుకుంటున్నారు. సమూహాలుగా పాల్గొనడం ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, జట్టు భావన, పరస్పర సహకార నైపుణ్యాలు పెరుగుతున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. విద్యార్థులకు శారీరక దృఢత్వాన్ని పెంపొందించే వ్యాయామాలతో పాటు మానసిక చురుకుదనాన్ని పెంచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. క్యాంపులో బాలికలు సంప్రదాయ ఆటల్లో, వాలీబాల్ వంటి క్రీడల్లో నైపుణ్యం కనబరుస్తున్నారు. ఇటీవల విద్యా ర్థుల్లో ఒత్తిడి, ఏకాగ్రత లోపం, శారీరక చలనం తగ్గిపోవడం వంటి సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి క్యాంపులు ఎంతో ఉపయోగమని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి వినూత్న కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులను పాఠ్యాంశాలకే పరిమితం చేయకుండా వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమని పలువురు పేర్కొంటున్నారు. సెలవులను వృథా చేయకుండా విద్యార్థుల్లో నూతనోత్సాహాన్ని నింపుతున్నారు.
నృత్యంలో ఆసక్తి
నృత్య పోటీల్లో పాల్గొని, అత్యుత్తమ ప్రదర్శనతో గుర్తింపు పొందాలనే ఆసక్తితో శిక్షణ తీసుకుంటున్నాను. స్టేజీపై నృత్య ప్రదర్శన ఇవ్వాలని కోరిక ఉంది. – మానస, విద్యార్థిని
డ్యాన్స్ అంటే ఇష్టం
డ్యాన్స్ అంటే ఇష్టం. మెలకువలు నేర్పుతూ డ్యాన్స్‌లో శిక్షకులు శిక్షణనిస్తున్నారు. డ్యాన్‌న్స్‌తో మైండ్ ప్రశాంతంగా ఉంది.
– రవళి, విద్యార్థిని
నృత్యం, యోగా, సంగీతం , క్విజ్ తదితర పోటీల్లో..
ఉత్సాహంగా పాల్గొంటున్న విద్యార్థులు


