నారాయణఖేడ్: ఎండు గంజాయిని స్వాధీనం చేసుకొని ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్ సీఐ శంకర్ వివరాల ప్రకారం... కర్ణాటకలోని బీదర్ నుంచి గంజాయిని తీసుకొస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు సీఐ శంకర్, ఎస్‌ఐలు అనుదీప్, హన్మంతు సిబ్బందితో కలిసి ఆదివారం తెల్లవారు జామున ఖేడ్– వాసర్‌ల మధ్య తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఖేడ్ మండలం శేరితండాకు చెందిన చవాన్ ప్రభు, మున్యానాయక్ తండాకు చెందిన రాథోడ్ పర్లాల్ రెండుబస్తాల్లో 30 కిలోల ఎండు గంజాయిని బీదర్ నుంచి తీసుకొస్తూ పట్టుబడ్డారు. గంజాయి విలువ రూ.15 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్టుచేసి, గంజాయితోపాటు మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకొని ఖేడ్ ఎకై ్సజ్ కార్యాలయంలో అప్పగించారు.
న్యాల్‌కల్(జహీరాబాద్): పేకాట ఆడుతున్న ఐదుగురిని ఆదివారం అరెస్టు చేశారు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ దోమ సుజిత్ కథనం ప్రకారం... మల్గి గ్రామానికి చెందిన పలువురు గ్రామ శివారులో గోవిందు పొలం వద్ద పేకాట ఆడుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. దాడిలో పట్టుబడిన ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.2వేలు నగదు, ఐదు సెల్‌ఫోన్లు, పేకాట ముక్కలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.
టేక్మాల్ మండలంలో..
టేక్మాల్(మెదక్): మండలంలోని సర్మోనికుంట శివారులో కోళ్లఫాం వద్ద పేకాట ఆడుతున్నట్లు సమాచారం వచ్చింది. ఈ మేరకు ఎస్‌ఐ అరవింద్‌కుమార్ సిబ్బందితో శనివారం రాత్రి దాడులు చేశారు. ఈ దాడుల్లో ధర్మావత్ నరేశ్, ధర్మావత్ నితిన్, మహ్మద్ అతిక్, మహ్మద్ ఇమ్రాన్, మేఘావత్ శంకర్, జర్పుల పండిత్‌ను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.22150 నగదు, ఫోన్‌లు, 3బైక్‌లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు.
మాసాన్‌పల్లిలో ఆరుగురు..
వట్‌పల్లి(అందోల్): అందోల్ మండల పరిధిలోని మాసాన్‌పల్లి గ్రామ శివారులో పేకాట స్థావరంపై జోగిపేట పోలీసులు ఆదివారం దాడిచేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు. గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడి చేశారు. పేకాట ఆడుతున్న గడ్డమీది మల్లేశ్, ఊస నరేందర్, డాకూరు రమేశ్, వావిలాల లక్ష్మయ్య, చింతకుంట వెంకటేశం, ఎర్రొళ్ల నరేశ్‌ను అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ పాండు తెలిపారు. వారి నుంచి రూ. 28,430 నగదుతో పాటు 2 మోటార్ సైకిళ్లు, 6 ఫోన్లు స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు.
చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రమాదవశాత్తు నిప్పంటుకొని పందిరి, సొప్పతోపాటు తదితర వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. ఈ సంఘటన మండల పరిధిలోని పెద్దకోడూరులో శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు ఇలా... గ్రామానికి చెందిన లచ్చపేట సురేశ్ పొలం వద్ద సమీప ప్రాంతం నుంచి మంటలు వ్యాపించి పందిరి అంటుకుంది. అక్కడే ఉన్న స్ప్రింక్లర్ పైపులు, వ్యవసాయ సామగ్రి, మొక్కజొన్న సొప్ప పూర్తిగా కాలిపోయింది. గమనించిన రైతు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా అప్పటికే పూర్తిగా కాలిపోయింది. సుమారు లక్ష రూపాయల నష్టం వాటిల్లిందని రైతు బోరున విలపించాడు.
మరో చోట బైక్ దగ్ధం
జోగిపేట(అందోల్): గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌ను తగులబెట్టారు. ఈ ఘటన మున్సిపాలిటీలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. అందోలు–జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో నివాసం ఉంటున్న రాజిరెడ్డికి చెందిన ద్విచక్రవాహనాన్ని శనివారం తన ఇంటి ప్రక్కన పార్కు చేశాడు. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వాహనాన్ని తగులబెట్టి పారిపోయారు. ఒక్కసారిగా మంటలు రావడంతో బయటకు వచ్చి చూసే సరికి వాహనం కాలిపోయింది. అనుమానితులపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
పుస్తెలతాడు చోరీ అంటూ
హంగామా..
తొగుట(దుబ్బాక): దొంగలు పుస్తెలతాడు ఎత్తుకెళ్లారని ఓ మహిళ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఈ సంఘటన మండల కేంద్రంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా... గ్రామానికి చెందిన సీత బాలమ్మ, మల్లయ్య దంపతులు రాత్రి భోజనం చేసి ఆరుబయట నిద్రించారు. అర్ధరాత్రి బాలమ్మ దొంగలు పడ్డారని అరిచింది. తన నోట్లో గుడ్డలు కుక్కి పుస్తెలతాడును ఎత్తుకెళ్లారని విలపించింది. వెంటనే స్థానికులు 100కు కాల్‌చేయగా రాత్రి 1.30 గంటల సమయంలో తొగుట సీఐ లతీఫ్, ఎస్‌ఐ రవికాంత్‌రావు ఘటనాస్థలానికొచ్చారు. పరిసరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి ఫిర్యాదు తీసుకున్నారు. కాగా ఆదివారం ఉదయం మరోమారు ఎస్‌ఐ వెళ్లి ఇంట్లో వస్తువులను పరిశీలించాడు. ఈక్రమంలో పుస్తెలతాడు సగభాగం దేవుని ఫొటో వెనకాల, మరో సగం సమీప పొలంలో లభించింది. అయితే ఎత్తుకెళ్లింది బయటి వ్యక్తులా లేక కుటుంబీకులా అని పోలీసులు విచారణ చేస్తున్నారు.


