వేర్వేరు చోట్ల ఐదుగురు అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు చోట్ల ఐదుగురు అదృశ్యం

Jun 1 2026 7:35 AM | Updated on Jun 1 2026 7:35 AM

ఉమ్మడి జిల్లాలో వేర్వేరు చోట్ల ఐదుగురు అదృశ్యమయ్యారు. పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వివాహిత మహిళ, హవేళిఘణాపూర్‌లో తల్లీ, ఇద్దరు కుమారులు, మెదక్‌ మండలంలో మతిస్థిమితం లేని వ్యక్తి కనిపించకుండా పోయారు. వివరాలు ఇలా...

ఇంటి నుంచి బయటకెళ్లిన వివాహిత..

పటాన్‌చెరు టౌన్‌: ఇంటి నుంచి బయటకెళ్లిన వివాహిత అదృశ్యమైన సంఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఇస్నాపూర్‌కు చెందిన శాంతి గత నెల 29న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఫోన్‌ చేయగా ఫోన్‌ ఇంట్లోనే ఉంది. ఆమె కోసం కుటుంబ సభ్యులు, తెలిసిన వారు, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. భార్య అదృశ్యంపై భర్త ధర్మరాజు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాలేజీ సీటు కోసం వెళ్లిన తల్లీ,పిల్లలు..

హవేళిఘణాపూర్‌(మెదక్‌): తల్లీ, ఇద్దరు కుమారులు అదృశ్యమయ్యారు. ఈ ఘటన మండలంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. మే 27న మాచవరం గ్రామానికి చెందిన గోవిందపురం అశోక్‌ భార్య శిల్ప, తన ఇద్దరు కుమారులు మనోజ్‌, శశాంక్‌తో కలిసి పదవ తరగతి పూర్తి కావడంతో ఇంటర్‌ కాలేజీలో సీటు కోసం హైదరాబాద్‌కు వెళ్లారు. తిరిగి ఇంటికి రాలేదు. దీంతో వారి ఆచూకీ కోసం భర్త అశోక్‌ బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. ఆదివారం మెదక్‌రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మతిస్థిమితం లేని వ్యక్తి..

మెదక్‌ మండలం మక్తభూపతిపూర్‌ గ్రామానికి చెందిన రాజు మే 24 నుంచి కనిపించడం లేదు. పలు చోట్ల వెతికినా కనిపించకపోవడంతో అతడి తల్లి కొత్తపల్లి మల్లమ్మ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement