పటాన్‌చెరు టౌన్: స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన బాలుడు నీట మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన అమీన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... అమీన్‌పూర్ పరిధిలోని సుల్తాన్‌పూర్ మెడికల్ డివైస్ పార్కు క్వారీకి ఐడీఏ బొల్లారానికి చెందిన ప్రదీప్(16)తో ఏడుగురు స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు శనివారం వెళ్లారు. అయితే ప్రదీప్‌కు ఈత రాకపోవడంతో థర్మోకోల్ సహాయంతో నీటిలోకి దిగేందుకు ప్రయత్నించాడు. అతనితో పాటు మధు అనే యువకుడు కూడా నడుముకు థర్మకోల్ కట్టుకొని నీటిలోకి వెళ్లాడు. అయితే నీటిలో ఉండగానే ఇద్దరి నడుములకు కట్టుకున్న థర్మకోల్ ఊడిపోయింది. మధు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగా, ప్రదీప్ మాత్రం లోతైన నీటిలో మునిగిపోయాడు. స్నేహితులు వెంటనే గమనించి కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి బాలుడు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
సుల్తాన్‌పూర్ మెడికల్ డివైస్ పార్కులో ఘటన


