జహీరాబాద్: హైదరాబాద్ నుంచి జహీరాబాద్ మీదుగా ముంబైకు బుల్లెట్ రైలు నడిపేందుకు రైల్వే బడ్జెట్‌లో గ్రీన్ సిగ్నల్ లభించగా, తాజాగా రూటు మార్చి డీపీఆర్‌లో వికారాబాద్‌కు చోటు కల్పించినట్లు సమాచారం. రైలు రూటు మార్చడం పట్ల జహీరాబాద్ ప్రాంత ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. గత ఫిబ్రవరి మొదటివారంలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్టెట్‌లో జహీరాబాద్ మీదుగా బుల్లెట్ రైలు నడిపేందుకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. రెండేళ్ల నుంచి ఈ ప్రాజెక్టు అంశం పెండింగ్‌లో పెట్టినా బడ్జెట్‌లో మాత్రం బుల్లెట్ రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి జహీరాబాద్‌కు చోటు కల్పించారు. జాతీయపెట్టుబడుల ఉత్పాదక మండలి(నిమ్జ్) ప్రాజెక్టుతో జహీరాబాద్ ప్రాంతం పెద్ద పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో డీపీఆర్‌లో వికారాబాద్‌కు చోటు కల్పించడంతో ప్రజల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఈ నిర్ణయం పారిశ్రామికాభివృద్ధికి అవరోధంగా పలువురు పేర్కొంటున్నారు. గంటకు 320 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ప్రతిష్టాత్మక బుల్లెట్ రైలును దారిమళ్లించే ప్రయత్నాలు జరగడం పట్ల సర్వత్రా అసంతృప్తి వ్యక్తం అవుతోంది. జహీరాబాద్‌ను పక్కనబెట్టి వికారాబాద్‌ను తెరపైకి తేవడం వెనుక రాజకీయ శక్తులున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
20 కిలోమీటర్ల వ్యత్యాసంతోనే...
హైదరాబాద్ నుంచి జహీరాబాద్ మీదుగా నడిపేందుకు మంజూరైన బుల్లెట్ రైలును వికారాబాద్ మీదుగా మళ్లించడం వల్ల కేవలం 20 కిలోమీటర్ల దూరం మాత్రమే తగ్గుతుంది. ఇంత తగ్గడాన్ని పరిగణలోకి తీసుకుని డీపీఆర్ మార్చడం సరైంది కాదనే అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు.
తగ్గనున్న ప్రయాణ వ్యవధి
కొత్త కారిడార్ కారణంగా ప్రయాణ వ్యవధి తగ్గనుంది. హైదరాబాద్ నుంచి పుణెకు ప్రస్తుతం 8 గంటల సమయం పడుతుండగా రెండు గంటల్లో గమ్యం చేరుకోవచ్చు. ముంబైకు 14 గంటల సమయం పడుతుండగా హైస్పీడ్ రైలు వల్ల కేవలం మూడు గంటల్లోనే చేరుకోవచ్చు. ఈ రైలు గరిష్ట వేగం 350 కి.మీ సామర్థ్యం కాగా, ఆపరేషనల్ వేగం 320కి.మీ ఉంటుంది. ఎలివేటెడ్, అండర్‌గ్రౌండ్‌తో కలిపి కారిడార్ ఉంటుంది. ఈ రైలులో 750 మంది ప్రయాణీకులు ప్రయాణం చేసే వీలుంటుంది.
ఎంపీ ప్రత్యేక చొరవ తీసుకోవాలి
ఒరిజినల్ డీపీఆర్(పాతరూట్)తోనే కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్లేలా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో రాజకీయాలకతీతంగా జహీరాబాద్ ఎంపీ ప్రత్యేక చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. తక్షణమే స్పందించి రైల్వే శాఖ ఉన్నతాధికారులతో చర్చించి డీపీఆర్ మార్చకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కొత్త రూట్‌మ్యాప్‌ను అడ్డుకోకపోతే నష్టపోవాల్సి వస్తుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గతంలోనే మంజూరై
పూర్తయిన డీపీఆర్
హైదరాబాద్–ముంబై ప్రాజెక్టును రెండుగా విభజించారు. గతంలో హైదరాబాద్–ముంబై హైస్పీడ్ రైల్ కారిడార్‌గా ఉన్న ప్రాజెక్టు ఇప్పుడు హైదరాబాద్–పుణె, పుణె–ముంబైగా మార్చారు. ప్రాజెక్టు మంజూరు కాగానే అప్పట్లోనే డీపీఆర్ పూర్తి చేశారు. ఆయా రైల్వేస్టేషన్ల మధ్య 711 కిలోమీటర్ల మేర కారిడార్‌ను నిర్మించనున్నారు. ఇందులో 93 కిలోమీటర్లు తెలంగాణలో, 121 కిలోమీటర్లు కర్ణాటకలో, 457కిలోమీటర్లు మహారాష్ట్రలో ఉంటుంది. ఆయా రాష్ట్రాల్లోని 11 స్టేషన్లలో రైళ్లను నిలిపేందుకు ప్రతిపాదించారు. అందులోభాగంగా హైదరాబాద్, జహీరాబాద్, కల్‌బుర్గి, షోలాపూర్, పండరీపూర్, అక్లోజ్, దౌండ్, పుణె, లోనావాలా, నవీ ముంబై, కుర్లా కంప్లెక్సు, బాంద్రా, ముంబై స్టేషన్ల మీదుగా ప్రయాణించనుందని అప్పట్లో ప్రకటించారు. వికారాబాద్‌కు బదులు జహీరాబాద్ మీదుగా అయితే 20 కిలోమీటర్లు మాత్రం అధికం అవుతుంది. రైజింగ్ తెలంగాణను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్–ముంబై భారీ ప్రాజెక్టులో 20 కిలోమీటర్ల దూరం పెద్ద సమస్య కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
తాజా డీపీఆర్‌లో వికారాబాద్‌కు చోటు
రాజకీయ ఒత్తిళ్లే కారణమా?
హైదరాబాద్ నుంచి పుణెకు,
అక్కడి నుంచి ముంబైకు
ఎంపీ దృష్టి సారించాలని ప్రజల విన్నపం


