సీఎం రేవంత్‌ను కలిసిన
ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్: ఖేడ్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధి, దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న వివిధ ప్రజాసమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఎమ్మెల్యే సంజీవరెడ్డి కోరారు. ఈ మేరకు ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డిని హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిసి సంజీవరెడ్డి వినతిపత్రం అందజేశారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పన, కీలక ప్రాజెక్టులు, రహదారుల విస్తరణ, గ్రామీణ, ప్రధాన రహదారుల అభివృద్ధి, పెండింగ్‌లో ఉన్న రోడ్ల నిర్మాణ పనులు, వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులను కేటాయించాలని కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన సీఎం వీలైనంత త్వరగా నిధులను విడుదలచేసి పనులు ప్రారంభమయ్యేలా చూస్తామ ని హామీనిచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.
జిల్లా విద్యాధికారిగా రోహిణి
సంగారెడ్డి ఎడ్యుకేషన్: హైదరాబాద్ జిల్లా విద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న రోహిణి బదిలీపై సంగారెడ్డికి రానున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. సంగారెడ్డి జిల్లా విద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు రంగారెడ్డి జిల్లా డీఈఓగా బదిలీ అయ్యారు. మూడేళ్లుగా జిల్లా విద్యాధికారిగా పనిచేసిన వెంకటేశ్వర్లు జిల్లాలో విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. బదిలీపై వెళ్తున్న డీఈఓ వెంకటేశ్వర్లను ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు.
అపాయింటెడ్ డే ప్రకటించాలి
జహీరాబాద్ టౌన్: టీజీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినట్లు అధికారికంగా జూన్ 2ను అపాయింటెడ్ డేగా ప్రకటించాలని ఆర్టీసీ జేఏసీ కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆర్టీసీ డిపోవద్ద జేఏసీ నేతలు నిరసన ప్రదర్శనలు జరిపారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ మాణిక్ మాట్లాడుతూ...ఆర్టీసీ ఎన్నికల కంటే ముందుగానే అపాయింటెడ్ డేట్‌ను ప్రకటించాలని కోరారు. పలుమార్లు నోటీసులిచ్చినా..సమ్మె చేసినా అపాయింటెడ్ డేకు మోక్షం కలగడంలేదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు శ్రీనివాస్, శివకుమార్, ఆర్‌వీ రావు, సోఫియా, నరేశ్,కాశీంలు పాల్గొన్నారు.
లారీల కోసం
రైతుల నిరసన
జిన్నారం (పటాన్‌చెరు): జిన్నారం పట్టణ కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కొనుగోలు కేంద్రానికి లారీలు రాకపోవడంతో రైతులు దాదాపు 15 రోజులుగా లారీల కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు రైస్ మిల్లర్ల దౌర్జన్యం, అధికారుల నిర్లక్ష్యం తోడై తాము నిలువునా మునిగిపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ కొనుగోలు కేంద్రం వద్ద నిరసనకు దిగారు. అదనంగా 30 సంచులు ఇస్తేనే కాంటా వేస్తామంటూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఒక్కో లారీకి అదనంగా 30 సంచుల ధాన్యం తరుగు పేరుతో ఇస్తేనే కాంటా పెట్టుకుంటామని మిల్లర్లు తెగేసి చెప్తున్నారన్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మిల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, సివిల్ సప్లై అధికారులు వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.


