టీచర్ల జీతాల్లో కోతలు సరికాదు | - | Sakshi
Sakshi News home page

టీచర్ల జీతాల్లో కోతలు సరికాదు

Jun 1 2026 7:29 AM | Updated on Jun 1 2026 7:29 AM

సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: హెల్త్‌ కార్డుల పేరిట ప్రభుత్వం విధివిధానాలు ప్రకటించకుండానే ఉపాధ్యాయుల జీతాల్లో కోత విధించడం సరికాదని పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు. టీపీటీఎఫ్‌, తపస్‌, యూటీఎఫ్‌, టీటీయూ సంఘాల ఉపాధ్యాయ నాయకులు ఆదివారం సంగారెడ్డిలో విలేకరులతో మాట్లాడుతూ.. ఆస్పత్రులతో సమావేశం నిర్వహించకుండానే ఆరోగ్యకార్డులు, విధివిధానాలు తెలియజేయకుండానే ఉపాధ్యాయుల నుంచి వసూలు చేసే ప్రీమియం రక్షణ టీచర్లను మోసగించే విధంగా ఉందన్నారు. విధివిధానాలు విడుదల చేసిన తర్వాత ప్రీమియం సంబంధించిన డబ్బులు జీతాల నుంచి కోత విధించాలని స్పష్టం చేశారు. ఈ పథకం ఇష్టంలేని వారికి మినహాయింపునివ్వాలని, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైనప్పుడు ఒకరి నుంచి మాత్రమే ప్రీమియం వసూలు చేయాలని కోరారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్‌ తపస్‌ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

విధివిధానాలు లేకుండా కోతలా??

నారాయణఖేడ్‌: ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు అమలు చేయనున్న ఆరోగ్య పథకం అమలు కోసం మార్గదర్శకాలు లేకుండానే వేతనంలో కోత పెట్టడం సరైందికాదని టీపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఖేడ్‌ మండలం తుర్కాపల్లి పాఠశాలలో ఏర్పాటు చేసిన సంఘం సమావేశంలో మాట్లాడారు. ఆరోగ్య పథకం విధివిధానాలు, మార్గదర్శకాలు, ఆస్పత్రుల జాబితా, వ్యాధుల ప్రస్తావన ప్రకటించకుండానే జూన్‌ 2 నుంచి అమలు చేస్తున్నామని ప్రకటించడం శోచనీయమన్నారు. మార్గదర్శకాలను వెంటనే ప్రకటించాలన్నారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మయ్య, కౌన్సిలర్‌ శ్రీనివాస్‌, జిల్లా అధ్యక్షులు సోమశేఖర్‌, ప్రధానకార్యదర్శి రాంచందర్‌, స్థానిక బాధ్యులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement