మంత్రి దామోదర రాజనర్సింహ
మునిపల్లి(అందోల్): మునిపల్లి మండలంలోని లింగంపల్లి బాలుర గురుకుల పాఠశాల అభివృద్ధికి రూ.14 కోట్లు మంజూరైనట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. మంత్రి ఆదివారం లింగంపల్లి గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గురుకుల పాఠశాల హాస్టల్ భవనం, డార్మెట్ గదులు, మరుగుదొడ్లు తదితర నిర్మాణాలకు నిధులు మంజూరు చేశామన్నారు. అనంతరం మంత్రి బుధేరాలోని మహిళా డిగ్రీ కళాశాలను సందర్శించారు. కళాశాల అభివృద్ధికి రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తాటిపల్లి కేజీఏబీ పాఠశాలను కూడా మంత్రి సందర్శించారు. అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.61 లక్షలు మంజూరుచేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తక్కడపల్లి బ్రిడ్జి నిర్మాణం పనులను ఆయన పరిశీలించారు.


