సబ్సిడీ ఆశలు ఆవిరి! | - | Sakshi
Sakshi News home page

సబ్సిడీ ఆశలు ఆవిరి!

May 30 2026 8:41 AM | Updated on May 30 2026 8:41 AM

వర్షాకాలంలో 7.60 లక్షల ఎకరాల్లో పలు పంటలు సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో సగం మేర పత్తి పంట వైపే రైతులు మొగ్గుచూపే అవకాశమున్నట్లు అధికార యంత్రాంగం భావిస్తోంది. రైతులు సబ్సిడీ విత్తనాల కోసం ఎదురు చూస్తున్నా ఈ ఏడాది కూడా అవి అందే అవకాశం లేనట్లు తెలుస్తోంది. జనుము, జీలుగ విత్తనాలు మినహా వానాకాలంలో సాగు చేసుకునేందుకు అవసరమైన ఇతర రకాల విత్తనాలు రైతులు బహిరంగ మార్కెట్లోనే కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

జహీరాబాద్‌: ఐదేళ్ల కాలంగా ఆయా ప్రభుత్వాలు సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేసే విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తూ వస్తున్నాయి. దీంతో రైతులు ప్రభుత్వం నుంచి సబ్సిడీ విత్తనాలు అందుతాయనే విషయంలో ఆశలు వదులుకున్నట్లు కనిపిస్తోంది. ఎన్‌ఎఫ్‌ఎస్‌ స్కీం కింద మాత్రమే సోయాబీన్‌ విత్తనాలు పరిమితంగా ఇచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. సోయాబీన్‌ పంట జహీరాబాద్‌, ఖేడ్‌ నియోజకవర్గంలోనే అత్యధికంగా సాగవుతూ వస్తోంది. దీంతో వ్యాపారులు పలు కంపెనీలకు సంబంధించిన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచుతున్నారు. ప్రైవేటుగా సోయాబీన్‌ విత్తనాలు కొనుగోలు చేయాలన్నా క్వింటాల్‌కు రూ.12వేలకు పైగా చెల్లించుకోవాల్సి వస్తుందని రైతులు పేర్కొంటున్నారు.

జనుము, జీలుగ విత్తనాలే సరఫరా..

రైతులు తమ భూములను సారంలోకి తెచ్చుకునేందుకు వీలుగా ప్రభుత్వం సబ్సిడీపై జనుము, జీలుగ విత్తనాలను సరఫరా చేస్తోంది. ఈ విత్తనాలు పచ్చిరొట్టగా ఉపయోగపడతాయి. జిల్లా వ్యాప్తంగా 7వేల క్వింటాళ్ల మేర అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 5వేల క్వింటాళ్ల మేర అందుబాటులో ఉన్నాయి. ఇంకా రెండు వేల క్వింటాళ్ల మేర రావాల్సి ఉంది.

ఆయా పంటల సాగు అంచనా..

జిల్లాలో వానాకాలంలో 7.60లక్షల ఎకరాల్లో వర్షాధారం కింద ఆయా పంటలు సాగు కానున్నాయి. ఇందులో సుమారు 3.60లక్షల ఎకరాల్లో ప్రధానంగా పత్తి పంటనే సాగయ్యే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. 1.50 లక్షల ఎకరాల్లో వరి, 70వేల ఎకరాల్లో సోయాబీన్‌, 70 వేల ఎకరాల్లో కంది, 20వేల ఎకరాల్లో మొక్కజొన్న, 10వేల ఎకరాల్లో మినుము, 10వేల ఎకరాల్లో పెసర పంట సాగయ్యే అవకాశం ఉంది.

పత్తి విత్తనాలు అందుబాటులో..

జిల్లా వ్యాప్తంగా లైసెన్స్‌ పొందిన డీలర్ల వద్ద పత్తి విత్తనాలు అందుబాటులో ఉండనున్నాయి. ఇందుకోసం వ్యవసాయ శాఖ తగిన ఏర్పాట్లు చేస్తోంది. అవసరం మేరకు విత్తనాలు అందుబాటులో ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు.

అందుబాటులో ఎరువులు

రైతులకు జూలై మాసం వరకు అవసరం మేరకు ఎరువులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. 20వేల టన్నుల యూరియా, 30వేల టన్నుల డీఏపీ ఉన్నట్లు చెబుతున్నారు. కాంప్లెక్సు ఎరువులు సరిపడా ఉన్నట్లు వివరిస్తున్నారు.

ప్రైవేటుగానే సోయాబీన్‌, మినుము, పెసర, పత్తి, మొక్కజొన్న విత్తనాలు కొనుగోలు!

50% సబ్సిడీపై కేవలం జనుము,

జీలుగ విత్తనాలు

అవసరం మేరకు అందుబాటులో ఎరువులు

సాగు అంచనా 7.60 లక్షల ఎకరాలు

3.60 వేల ఎకరాల్లో పత్తి పంట!

ఆందోళన చెందనవసరం లేదు

వానాకాలం పంటలను సాగు చేసుకునేందుకు వీలుగా రైతులకు విత్తనాలు, ఎరువులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటాయి. ఏ మాత్రం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. పత్తి విత్తనాలు ఎంఆర్‌పీ ధర కంటే తక్కువకు లభించే అవకాశం ఉంది. ఇతర విత్తనాలు కూడా అవసరం మేరకు అందుబాటులో ఉంచుతాము. ఎరువుల విషయంలోనూ ఎలాంటి ఆందోళన పడవద్దు.

– శివప్రసాద్‌,

జిల్లా వ్యవసాయాధికారి–సంగారెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement