కేతకీ హుండీ ఆదాయం రూ.31లక్షలు | - | Sakshi
Sakshi News home page

కేతకీ హుండీ ఆదాయం రూ.31లక్షలు

May 30 2026 8:41 AM | Updated on May 30 2026 8:41 AM

ఝరాసంగం(జహీరాబాద్‌): కేతకీలోని సంగమేశ్వరాలయ హుండీ ఆదాయం రూ.31,46,891లు వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు. గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు శుక్రవారం ప్రత్యేక పూజలు చేసి లెక్కింపు ప్రారంభించారు. ఆలయ మంటపంలో శివకేశవ సేవా సమితి, శ్రీరామ శివ సమితి సభ్యులు, గత 67 రోజులుగా వివిధ ప్రాంతాల భక్తులు స్వామివారిని దర్శించుకుని హుండీలో సమర్పించిన నగదును లెక్కించారు. కార్యక్రమంలో పర్యవేక్షకులు రంగారావు, ఆలయ ఈవో శివ రుద్రప్ప, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

వివాదాస్పద భూమిపై సర్వే

పటాన్‌చెరు: ముత్తంగి పరిధిలోని పాటిలో వివాదాస్పద భూమిపై రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. సర్వే నంబర్‌ 239లో చేపట్టిన ఈ కార్యక్రమం ఉద్రిక్త వాతావరణంలో సాగింది. కొన్నేళ్లుగా ఆ భూమిలో తమకు ప్లాట్లు ఉన్నాయని పేర్కొంటూ ప్లాట్‌ యజమానులు అధికారులను ప్రశ్నించారు. అయితే అధికారులు మాత్రం పోలీసుల భద్రత మధ్య సర్వే కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ప్లాట్లుగా ఉన్న భూమిని వ్యవసాయ భూమిగా చూపిస్తూ రెవెన్యూ అధికారులు తప్పుడు రికార్డులు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు బౌన్సర్లు, పోలీసుల సమక్షంలో సర్వే కొనసాగడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

ప్రణాళికాబద్ధంగా

చదువుకోవాలి

ఎస్పీ పరితోశ్‌ పంకజ్‌

సంగారెడ్డి జోన్‌: విద్యార్థులు లక్ష్యసాధనకు ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలని ఎస్పీ పరితోశ్‌ పంకజ్‌ సూచించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన స్పార్క్‌ కార్యక్రమంలో పోలీసు అధికారుల కుటుంబ సభ్యులు, వారి పిల్లలతో ఎస్పీ మాట్లాడారు. పోలీసు కుటుంబాల పిల్లలకు వారి ప్రతిభను ప్రోత్సహించేందుకే ఈ స్పార్క్‌ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఖాకీ కిడ్స్‌కు విద్య ప్రాముఖ్యత, లక్ష్యసాధనకు కృషి చేయాల్సిన విషయాలను వివరించారు. సమావేశంలో అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

ఖేడ్‌ ఏడీఏ నూతన్‌ కుమార్‌

నారాయణఖేడ్‌: రైతులు ఆధార్‌కార్డు, పట్టా పాసుపుస్తకం, మొబైల్‌ నంబరుతో మీసేవ కేంద్రాలకు వెళ్లి లేదా సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి ఈనెల 31వ తేదీ లోపు ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని ఖేడ్‌ ఏడీఏ నూతన్‌ కుమార్‌ సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాల్లో లబ్ధికిగాను ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడం తప్పనిసరని తెలిపారు. రెండు రోజులే గడువు ఉన్నందున రైతులు వెంటనే రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని సూచించారు.

రోడ్లపై జొన్న సంచులు

మునిపల్లి(అందోల్‌): మార్క్‌ఫెడ్‌లో జొన్నలను అమ్మడానికి తెస్తుండగా ట్రాక్టర్ల నుంచి రోడ్డుపై జొన్న బస్తాలు పడిపోయాయి. గార్లపల్లి, పిల్లోడి గ్రామాల నుంచి శుక్రవారం రైతులు మేళసంగ్యం గ్రామ శివారు కల్కి పత్తిమిల్లుకు, తాటిపల్లి గ్రామంలోని జొన్నల కొనుగోలు కేంద్రాలకు తెస్తుండగా రోడ్లపై లోడ్‌ ఎక్కువై కింద పడిపోయాయి. ట్రాక్టర్ల నుంచి జొన్నల సంచులు కింద పడి పగిలిపోవడంతో జొన్నలు నేలపై రాలిపోయాయి. కిందపడిన జొన్నలను మళ్లీ శ్రమకోర్చి సంచుల్లో నింపి ట్రాక్టర్‌లో ఎక్కించారు.

Advertisement
 
Advertisement
Advertisement