ఇరిగేషన్‌లో పైరవీల ప్రవాహం! | - | Sakshi
Sakshi News home page

ఇరిగేషన్‌లో పైరవీల ప్రవాహం!

May 30 2026 8:41 AM | Updated on May 30 2026 8:41 AM

నీటి పారుదలశాఖలో కీలక పోస్టింగ్‌ల కోసం పెద్ద ఎత్తున పైరవీలు జరిగాయా..? కాసులు కురిపించే కొన్ని సబ్‌ డివిజన్ల పోస్టులు దక్కించుకునేందుకు కొందరు అధికారులు తెరవెనుక పావులు కదిపారా? ఇందుకోసం ఓ అమాత్యుని స్థాయిలో సిఫార్సుల తతంగం నడిచిందా? అంటే అవుననే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగల బదిలీల ప్రక్రియను చేపట్టిన విషయం విదితమే. ఇందులోభాగంగా నీటిపారుదల శాఖలోనూ ఈ బదిలీల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. అయితే కాసుల పంట పండించే కొన్ని కీలక పోస్టులు జిల్లాలో ఉన్నాయి. ఈ పోస్టులు దక్కించుకుంటే సదరు అధికారి అక్రమార్జన రూ.కోట్లలో ఉంటుంది. చెరువులు, కుంటల ఎన్‌ఓసీలు జారీ చేస్తే పెద్ద మొత్తంలో ముడుపులు చేతులు మారుతుంటాయి. అలాగే చెరువులు, కుంటల భూములు కబ్జా జరుగుతుంటే ఆపకుండా కళ్లు మూసుకున్నందుకు కూడా కాసుల వర్షం కురుస్తుంది. ఇలా ఎన్‌ఓసీలు, కబ్జాల జాతర ఉండే సబ్‌ డివిజన్లలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్ల పోస్టింగ్‌లకు భలే డిమాండ్‌ ఉంటుంది. అయితే జిల్లాలో ఓకే చోట పాతుకుపోయిన ఇద్దరు అధికారులు ఇలాంటి కీలక సబ్‌ డివిజన్‌ల పోస్టులను దక్కించుకుంటున్నట్లు ఆశాఖ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకుల అడుగులకు మడుగులొత్తడంలో ఆరితేరిన ఈ అధికారులు ఇప్పటికే రూ.కోట్లకు పడగలెత్తారనే ఆరోపణలున్నాయి. ఈ అధికారులు ఈ బదిలీల్లో మళ్లీ కాసులు కురిపించే పోస్టులకు ఎసరు పెట్టినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఓ అమాత్యుని స్థాయిలో సిఫార్సులు చేయించుకున్నారంటే వీరి పైరవీలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

నేడో రేపో ఉత్తర్వులు..

ఈ బదిలీలకు సంబంధించి నేడో రేపు ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయి. మార్గదర్శకాల ప్రకా రం జూన్‌ 3వ తేదీలోగా బదిలీ అయిన స్థానాల్లో అధికారులు బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో నేడు (శనివారం)గానీ, సోమవారం గానీ బదిలీల ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయి.

లొసుగులను ఆసరాగా చేసుకుని..

జిల్లాలో నీటిపారుదలశాఖలో ఒక సర్కిల్‌ కార్యాలయంతోపాటు, నాలుగు డివిజనల్‌ కార్యాలయాలు, 17 సబ్‌ డివిజనల్‌ కార్యాలయాలున్నాయి. ఈ కార్యాలయాల్లో ఎస్‌ఈతో పాటు నలుగురు డీఈలు, 17 మంది డిప్యూటీ ఈఈలు, 29 ఏఈలు పనిచేస్తున్నారు. బదిలీల మార్గదర్శకాల ప్రకారం ఒకేచోట నాలుగేళ్లుగా పనిచేస్తున్న వారందరిని తప్పకుండా బదిలీ చేయాలి. ఈ నిబంధనల ప్రకారం ఒక డిప్యూటీ ఈఈని అదే డివిజన్‌లో పోస్టింగ్‌ ఇచ్చేందుకు వీలు లేదు. కానీ కొందరు డిప్యూటీ ఈఈ పోస్టింగ్‌ల విషయంలో ఈ మార్గదర్శకాల్లోని లొసుగులను ఆసరాగా చేసుకుని కాసులు కురిపించే సబ్‌ డివిజన్‌ పోస్టులను పదిలం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

కాసులు కురిపించే పోస్టులకు పెద్ద ఎత్తున లాబీయింగ్‌

అమాత్యుని స్థాయిలో సిఫార్సులు..!?

నీటిపారుదలశాఖలో

ట్రాన్స్‌ఫర్ల వ్యవహారం తీరు

Advertisement
 
Advertisement
Advertisement