చివరి గింజవరకు కొంటాం | - | Sakshi
Sakshi News home page

చివరి గింజవరకు కొంటాం

May 30 2026 8:41 AM | Updated on May 30 2026 8:41 AM

నారాయణఖేడ్‌: రైతులు పండించిన పంట ఉత్పత్తులను చివరిగింజ వరకు కొంటామని, రైతులకు ఎమ్మెల్యే సంజీవరెడ్డి ధైర్యం చెప్పారు. ఖేడ్‌ మండలం లింగాపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం, మనూరులో జొన్నల కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆయన తనిఖీ చేసి అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ధాన్యం నాణ్యత, రికార్డులను పరిశీలించారు. అంతకుముందు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఈసారి 35% వరకు అధిక దిగుబడి వచ్చిందన్నారు. గోడౌన్లలో ఖాళీలేక, లారీల కొరత, మిల్లుల్లో పాతవడ్లు ఉండటం తదితర వాటివల్ల కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. నిబంధనలను సడలించి రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు తీసుకొంటోందన్నారు. రెండేళ్లుగా జొన్నలు గోడౌన్లలో మగ్గుతుండగా తక్కువ ధరకు ప్రభుత్వం ఇస్తామన్నా కొనేవారు లేరన్నారు. జొన్నలు పండించవద్దని చెప్పినా పండిస్తున్నారన్నారు. పంట మార్పిడికి రైతులు ప్రాధాన్యతనివ్వాలని కోరారు.

రెవెన్యూ భవనంకు రూ.12కోట్లు

వివిధ అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. ఖేడ్‌లో రెవెన్యూ భవనం కోసం రూ.12 కోట్లు, పర్యాటక శాఖ ద్వారా బోరంచ, నల్లవాగు, కమలాపూర్‌లలో బోటింగ్‌ కోసం రూ.2 కోట్లు, బోరంచలో ఎకోపార్కు కోసం రూ.2 కోట్లు, ఖేడ్‌లో ఏటీసీ కేంద్రానికి రూ.47 కోట్లు మంజూరుకాగా టెండర్‌కు ప్రక్రియ పూర్తయ్యి త్వరలో పనులు ప్రారంభం కానున్నాయన్నారు. మంజీరా నీటిని ఎత్తిపోతల ద్వారా నల్లవాగుకు తరలించడానికి రూ.74 కోట్లతో డీపీఆర్‌ సిద్ధంకాగా త్వరలో జీవో వెలువడనుందని చెప్పారు.

ఎమ్మెల్యే సంజీవరెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement