స్విమ్మింగ్‌పూల్‌లో పడి ఎఫ్‌ఎస్‌ఓ మృతి | - | Sakshi
Sakshi News home page

స్విమ్మింగ్‌పూల్‌లో పడి ఎఫ్‌ఎస్‌ఓ మృతి

May 30 2026 8:41 AM | Updated on May 30 2026 8:41 AM

స్విమ్మింగ్‌పూల్‌లో పడి ఎఫ్‌ఎస్‌ఓ మృతి ఉపాధి కూలీ మృతి 11 మంది బైండోవర్‌ రోడ్డుపై యువకుల ఘర్షణ చెక్కుల పంపిణీలో గందరగోళం

వెల్దుర్తి(తూప్రాన్‌): ప్రమాదవశాత్తు వెల్దుర్తి ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌ స్విమ్మింగ్‌ పూల్‌లో పడి మృతిచెందాడు. వివరాలు ఇలా... కామారెడ్డిలో ఉంటున్న శ్రీనివాస్‌ గురువారం సాయంత్రం తన కొడుకుకు ఈత నేర్పించడానికి స్థానికంగా ఉన్న ఓ స్విమ్మింగ్‌ పూల్‌కు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటమునిగి మృతిచెందాడు. ఎఫ్‌ఎస్‌ఓ మృతి పట్ల ఫారెస్ట్‌ సిబ్బంది విచారం వ్యక్తం చేశారు. విధుల పట్ల అంకితభావంతో పనిచేసే వ్యక్తి అకాల మృతి చెందడం బాధాకరమన్నారు.

చిన్నకోడూరు(సిద్దిపేట): పని చేసే స్థలంలోనే అస్వస్థతకు గురై ఉపాధి హామీ కూలీ మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని చంద్లాపూర్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన పురుమాండ్ల ఇంద్రసేనారెడ్డి(56) రోజు మాదిరిగా ఉదయం ఉపాధి పనులకు వెళ్లాడు. పనులు పూర్తి చేసుకొని ఇంటికి వెళ్లే సమయంలో పని ప్రదేశంలో అస్వస్థతకు గురై కిందపడిపోయాడు. వెంటనే తోటి కూలీలు గ్రామంలోని ఆర్‌ఎంపీ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అప్పటికే అతడు మృతి చెందాడు. మృతుడికి భార్య శోభ, ఇద్దరు కుమారులు ఉన్నారు.

బెజ్జంకి(సిద్దిపేట): అక్రమంగా ఇసుక తరలిస్తున్న పలువురిని గుర్తించి శుక్రవారం బైండోవర్‌ చేసినట్లు తహసీల్దార్‌ శ్రీకాంత్‌ తెలిపారు. వివరాలు ఇలా... మండలంలోని గాగిళ్లాపూర్‌కు చెందిన 11 మంది యువకులు దాచారం శివారులో అక్రమంగా ఇసుకను అక్రమంగా డంప్‌ చేశారు. వారిలో 10మందితో పాటు సిద్దిపేటకు తరలిస్తున్న ఒక్కరిని బైండోవర్‌ చేశామని తెలిపారు. మిగితా ఒక్కరిని త్వరలోనే బైండోవర్‌ చేస్తామని అధికారులు పేర్కొన్నారు.

క్రిమినల్‌ కేసు నమోదు

కౌన్సిలింగ్‌.. తహసీల్దార్‌ ఎదుట బైండోవర్‌

వట్‌పల్లి(అందోల్‌): ప్రధాన రహదారిపై ఘర్షణ పడుతూ.. ఇతరులకు ఇబ్బంది కలిగించిన ఆరుగురిపై పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. ఈ ఘటన శుక్రవారం జోగిపేట పోలీస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ లవకుమార్‌ కథనం ప్రకారం... అందోల్‌ మండల పరిధిలోని సంగుపేట అండర్‌పాస్‌ బ్రిడ్జీ వద్ద ప్రధాన రహదారిపై ఈనెల 26న రెండు గ్రూపులుగా ఉన్న ఆరుగురు యువకులు కొట్లాడుతూ గొడవలు సృష్టించి రోడ్డుపై వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు కలిగించారు. ఈ విషయమై జోగిపేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మాసాన్‌పల్లి, పోతిరెడ్డిపల్లి, సదాశివపేట ప్రాంతాలకు చెందిన బంటు వంశీకృష్ణ, మన్నె అనిల్‌, విష్ణు, జోగిపేటకు చెందిన ముద్దసి అహ్మద్‌, మహ్మద్‌ అబ్దుల్‌, మహ్మద్‌ అస్లాంను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. యువకుల తల్లిండ్రులను పిలిపించి మళ్లీ ఎలాంటి గొడవలకు వెళ్లవద్దని వారి సమక్షంలో కౌన్సిలింగ్‌ ఇచ్చారు. అనంతరం అందోల్‌ తహసీల్దారు మధుకర్‌రెడ్డి ఎదుట బైండోవర్‌ చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

పాపన్నపేట(మెదక్‌): మండల కేంద్రంలో శుక్రవారం పంపిణీ చేసిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సరైన సౌకర్యాలు లేక గందరగోళం నెలకొంది. 104 మంది లబ్ధిదారులకు ఇరుకై న సమావేశ మందిరంలో పంపిణీ చేయడంతో ప్రజా ప్రతినిధులకు, అధికారులకు సీట్లు సరిపోలేదు. దీంతో చాలా మంది బయటే నిల్చున్నారు. ఒక వైపు మండే ఎండలు, మరో వైపు ఉక్కపోతతో జనాలు ఇబ్బందులు పడ్డారు. నిర్వహణలో రెవెన్యూ అధికారులు విఫలమాయ్యరని పలువురు మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement