● అగ్రి హార్టి సొసైటీ కార్యదర్శి వీరభద్రరావు
● ములుగు వర్సిటీలో అడ్వైజరీ కమిటీ సమావేశం
ములుగు(గజ్వేల్): ప్రకృతి వైపరీత్యాల ప్రభావాలను తగ్గించేందుకు శాస్త్రవేత్తలు సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి సారించాలని అగ్రి హార్టి సొసైటీ కార్యదర్శి, ఐసీఏఆర్ పాలక మండలి సభ్యుడు కె.వీరభద్రరావు పేర్కొన్నారు. శుక్రవారం ములుగు కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో వీసీ డాక్టర్ రాజిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన జోనల్ రీసెర్చ్, ఎక్స్‌టెన్సన్ అడ్వైజరీ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో పాడైన పాలిహౌస్‌ల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉద్యాన పంటల అభివృద్ధికి ఎన్‌హెచ్‌బి, నాబార్డు, సీఎస్‌ఆర్ నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని కోరారు. కాలిఫోర్నియా వంటి వాతావరణ పరిస్థితులు తెలంగాణలో ఉండటంతో రాష్ట్రంలో పలు ఉద్యాన పంటలకు మంచి అవకాశాలున్నాయని తెలిపారు. బాలానగర్ సీతాఫలం, ద్రాక్ష తెలంగాణకు ప్రత్యేక గుర్తింపుతెచ్చే పండ్లుగా అభివర్ణించారు. కోతుల సమస్య రైతులకు ఇబ్బందిగా మారిందని, దీనిపై శాసీ్త్రయ పరిష్కారాలు అవసరమన్నారు. వర్సిటీ వీసీ డాక్టర్.రాజిరెడ్డి మాట్లాడుతూ.. జీవ నియంత్రణ పద్ధతులు ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో కీలకమన్నారు. రాష్ట్రంలో పంటల వైవిధ్యీకరణ అత్యంత అవసరమని తెలిపారు. అనతరం వీరభద్రరావు వర్సిటీ అధికారులతో కలిసి పరిశోధన కేంద్రాల ప్రచురణలను విడుదల చేశారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖ సంయుక్త ఉద్యాన సంచాలకులు సంగీత లక్ష్మి, జిల్లా ఉద్యానశాఖ అధికారులు, వర్సిటీ అధికారులు పాల్గొన్నారు.


