● నాలుగు దూడలు మృతి
● బూడిదైన గడ్డి కట్టలు
అక్కన్నపేట(హుస్నాబాద్): అగ్నిప్రమాదంలో పశువుల పాకలో కట్టేసిన ఆవు దూడలు చనిపోగా, గడ్డికట్టలు కాలిపోయాయి. ఈ సంఘటన మండలంలోని మల్లంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన రైతు కోల చంద్రయ్య తన వ్యవసాయ క్షేత్రంలో పశువులను కట్టేశాడు. అయితే షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా నిప్పురవ్వలు చెలరేగాయి. దీంతో పశువుల పాకతో పాటు నాలుగు దూడలు అక్కడికక్కడే మృతి చెందాయి. అలాగే 500గడ్డి కట్టలు సైతం కాలి బూడిదయ్యాయి. 10గుంటల వ్యవసాయ భూమితో పాటు తనకున్న పశువులపై ఆధారపడి రైతు జీవిస్తున్నాడు. ఈ ఘటనతో దాదాపుగా రూ.5లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు పలువురు రైతులు తెలిపారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ ఏఈ హరీశ్‌రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించారు. బాధిత రైతుకు నష్ట పరిహారం అందేలా ప్రభుత్వానికి నివేదిస్తామని ఆయన పేర్కొన్నారు.


