తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

May 29 2026 8:16 AM | Updated on May 29 2026 8:16 AM

కొండాపూర్‌(సంగారెడ్డి): అకాల వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతు సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పశ్యపద్మ డిమాండ్‌ చేశారు. మండల కేంద్రమైన కొండాపూర్‌లో గురువారం వరి కొనుగోలు కేంద్రాన్ని రైతు సంఘం నాయకులు పరిశీలించి, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పశ్య పద్మ మాట్లాడుతూ...కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని కోరారు. ప్రకృతి వైపరీత్యం కారణంగా అకాల వర్షాలతో రైతుల ధాన్యం వర్షార్పణం కావడం బాధగా ఉందని, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. సకాలంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక పోవడంతో పాటు కేంద్రాలలో సరైన సౌకర్యాలు లేకపోవడంతోనే కొనుగోలు ఆలస్యం అయ్యిందన్నారు. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి రైతులకు సకాలంలో ఎరువులను పంపిణీ చేయా లని కోరారు. రైతు సంఘం జిల్లా ఇన్‌చార్జి దశరథ్‌, జిల్లా కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, నాయకులు సంజీవరెడ్డి, రాంరెడ్డి, బ్రహ్మం, బాల్‌రాజ్‌, నర్సింహులు, శివరాములు, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement