సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సాయిలు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: కేరళం మాజీ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌పై రాజకీయ దురుద్దేశంతోనే ఈడీ దాడులు జరుగుతున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సాయిలు ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అపవిత్ర కూటమిల బురదజల్లే విధానాలు మానుకోవాలని హెచ్చరించారు. కేరళం మాజీ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌పై ఈడీ దాడులను నిరసిస్తూ సంగారెడ్డిలో గురువారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో సాయిలు పాల్గొని మాట్లాడారు. రాజకీయ ప్రత్యర్థులను వేటాడేందుకు రాజ్యంగ సంస్థలను ఉపయోగించే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఫాసిస్టు పద్ధతిలో వ్యవహరిస్తోందన్నారు. ఆ రాష్ట్రంలోని యూడీఎఫ్ ప్రభుత్వం కూడా బీజేపీకి అనుసంధానంగా పని చేస్తుందని విమర్శించారు. తిరువనంతపురంలోని పినరయి విజయన్ అద్దె నివాసం, కన్నూర్‌లోని ఆయన కుటుంబ నివాసంలో ఏకకాలంలో ఈడీ సోదాలు చేశాయని ఢిల్లీలో బీజేపీ, కాంగ్రెస్ కలసి తీసుకున్న నిర్ణయమే ఈడీ చర్యకు కారణమని మండిపడ్డారు. ఈ కుట్రలకు సీపీఎం బెదిరేదిలేదన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు యాదగిరి, కృష్ణ, నాయకులు అశోక్, అర్జున్, తదితరులు పాల్గొన్నారు.


