పసుపులేరును తవ్వేస్తుండ్రు | - | Sakshi
Sakshi News home page

పసుపులేరును తవ్వేస్తుండ్రు

May 29 2026 8:16 AM | Updated on May 29 2026 8:16 AM

యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా

మెదక్‌ జిల్లాలో వాగులను యథేచ్ఛగా తోడేస్తున్నారు. ఇసుక అక్రమ రావాణాకు అడ్డూఅదుపులేకుండా పోతోంది. కఠిన చర్యలు తీసుకుంటామని సాక్షాత్తు కలెక్టర్‌ హెచ్చరించినా అక్రమార్కులు ఇసుక దందాను దర్జాగా సాగిస్తున్నారు. కొందరు ఏకంగా వృత్తిగా మార్చుకుని రాత్రీపగలూ రవాణా చేస్తుండటం గమనార్హం. అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. – మెదక్‌జోన్‌

వెుదక్‌ పట్టణం సమీపంలో తిమ్మక్కపల్లి తండా ఉంది. ఆ తండాలో సుమారు 25 నివాసగృహాలు ఉన్నాయి. ఆ తండా పక్కనే పసుపులేరు వాగుతో పాటు బొల్లారం మత్తడి ఉంది. వేసవి కాలం వస్తే వాటిలో నీరు తగ్గడంతో ఇసుక దందా కొనసాగుతుంది. ఆ తండావాసులు ఇంటికో ఎడ్లబండిని కొనుగోలు చేసి వాగు నుంచి నిరంతరంగా ఇసుకను తరలిస్తున్నారు. మరోవైపు తండా చుట్టూ రాశులు పోసి ఒక్కో ట్రాక్టర్‌ ఇసుకను రూ.4వేల నుంచి రూ. 5వేల చొప్పున విక్రయిస్తున్నారు. నిత్యం 30 నుంచి 40 ట్రాక్టర్ల ఇసుకను విక్రయిస్తున్నారు.

మెడికల్‌, నర్సింగ్‌ కాలేజీలకు..

మెదక్‌ పట్టణ శివారు పిల్లికొట్టాల్‌ ప్రాంతంలోని ఎంసీహెచ్‌ పక్కన మెడికల్‌, నర్సింగ్‌ కాలేజీల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వాటికి అవసరమయ్యే ఇసుకను తండా వాసులే సరఫరా చేస్తున్నారు. రోజూ 30 నుంచి 40 ట్రిప్పుల ఇసుకకు సరఫరా చేస్తూ రోజూ సుమారు రూ.1.50 లక్షల ఆదాయం సంపాదిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వారంతా ఇసుకను తరలించే వృత్తిగా మార్చుకున్నారు.

రైతుల్లో ఆందోళన

పసుపులేరు వాగుతో పాటు బొల్లారం మత్తడిలో మో టార్లు బిగించి పరిసర ప్రాంత రైతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీటిలో నిత్యం ఇసుకను తోడేస్తుండటంతో నీటి ఊ టలు తగ్గిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటే దాడులకు తెగబడుతున్నారని, పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేసినా స్పందించటంలేదని బాధిత రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.

నిత్యం 30 నుంచి 40 ట్రాక్టర్లలో తరలింపు

రోజుకు రూ.1.50 లక్షల ఆదాయం

కళ్లప్పగించి చూస్తున్న ఉన్నతాధికారులు

తండా చుట్టూ ఇసుక కుప్పలే..

తిమ్మక్కపల్లి తండా చుట్టూ, ఏఇంటి ముందు చూసినా ఇసుక కుప్పలే దర్శనం ఇస్తాయి. అయినా అధికారులు దృష్టి సారించడంలేదంటే మామూళ్లకు ఆశపడి చర్యలు తీసుకోవడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement