నర్సాపూర్‌లో అర్ధరాత్రి ఉద్రిక్తత | - | Sakshi
Sakshi News home page

నర్సాపూర్‌లో అర్ధరాత్రి ఉద్రిక్తత

May 29 2026 8:16 AM | Updated on May 29 2026 8:16 AM

ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు

తెల్లవార్లూ పోలీసుల గస్తీ!

గోరక్షకులు, ముస్లిం యువకుల మధ్య ఘర్షణ

నర్సాపూర్‌: పట్టణంలో బుధవారం అర్ధరాత్రి ఇరువర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడగా, పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వివరాల్లోకి వెళ్తే... బక్రీద్‌ పండుగ నేపథ్యంలో పోలీసులు స్థానిక చౌరస్తాలో సుమారు నెల రోజుల క్రితమే చెక్‌పోస్టు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు చేపట్టారు. బుధవారం రాత్రి కౌడిపల్లి వైపు నుంచి ఒక వాహనంలో ఆవులను తరలిస్తున్నారనే సమాచారంతో కొందరు గోరక్షక దళ సభ్యులు రాత్రి 12 గంటల సమయంలో స్థానిక చౌరస్తాకు చేరుకుని నిఘా పెట్టారు. అదే సమయంలో గోరక్షక దళ సభ్యులు చౌరస్తాలో గుమిగూడారనే విషయం తెలుసుకున్న కొందరు ముస్లిం యువకులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాలకు చెందిన యువకులు చౌరస్తాలో రెండు గుంపులుగా ఏర్పడి, ఒకరి కదలికలను మరొకరు నిశితంగా గమనించడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక సీఐ జాన్‌రెడ్డి, ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి తమ సిబ్బందితో కలిసి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాల యువకులతో మాట్లాడి, అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించినప్పటికీ వారు వినలేదు. దీంతో రంగంలోకి దిగిన పోలీసు అధికారులు ఇరువర్గాలను చెదరగొట్టి అక్కడి నుంచి పంపించారు. అయినప్పటికీ, కొందరు యువకులు చౌరస్తా నుంచి వెళ్ళిపోయి వాహనాలపై పట్టణంలోని పలు వీధుల్లో తిరుగుతున్నారనే సమాచారం పోలీసులకు అందింది. దీంతో సీఐ, ఎస్‌ఐలు తమ పెట్రోలింగ్‌ సిబ్బందితో కలిసి తెల్లవారుజామున 5 గంటల వరకు పట్టణంలో ముమ్మరంగా గస్తీ నిర్వహించారు. రోడ్లపై తిరుగుతూ కనిపించిన వారిపై లాఠీలకు పని చెప్పి ఇళ్లకు పంపించేశారు. ఈ విషయమై స్థానిక ఎస్‌ఐ రంజిత్‌రెడ్డిని వివరణ కోరగా.. చౌరస్తాకు రెండు వర్గాలు రావడంతో కొంతసేపు ఉద్రిక్తత ఏర్పడిందని తెలిపారు. సీఐ జాన్‌రెడ్డి ఆధ్వర్యంలో అందరిని అక్కడి నుంచి పంపించి, పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చామని చెప్పారు. తెల్లవారుజాము వరకు పట్టణంలో గస్తీ నిర్వహించినట్లు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement