మల్లన్నసాగర్‌ కాలువలో మృతదేహం | - | Sakshi
Sakshi News home page

మల్లన్నసాగర్‌ కాలువలో మృతదేహం

May 29 2026 8:16 AM | Updated on May 29 2026 8:16 AM

మల్లన్నసాగర్‌ కాలువలో మృతదేహం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చేపల వేటకు వెళ్లి.. సామగ్రి తీసుకొస్తానని వెళ్లి.. యువతి అదృశ్యం

కొండపాక(గజ్వేల్‌): మల్లన్న సాగర్‌ కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు కుకునూరుపల్లి పోలీసులు తెలిపారు. గజ్వేల్‌ మండలం కొడకండ్ల గ్రామ శివారులోని మల్లన్న సాగర్‌ కాలువలో మృతదేహం ఉందన్న విషయాన్ని స్థానికులు పోలీస్టేషన్‌కు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కాలువలోంచి సుమారు 35 ఏళ్ల వయస్సున్న మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుని ఒంటిపై బ్లూ కలర్‌ బనియన్‌, బూడిదరంగు షర్టు ఉందన్నారు. గుండ్రటి ముఖం 5.3 ఫీట్ల ఎత్తు, కుడి చేతికి స్టీల్‌ కడియం, ఎడమ కాలికి నల్లటి దారం కట్టిందన్నారు. మృత దేహాన్ని గజ్వేల్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో భద్ర పర్చామన్నారు. మరిన్ని వివరాల కోసం పోలీస్టేషన్‌ నంబరు 87126 67466ను సంప్రదించాలన్నారు.

పటాన్‌చెరు టౌన్‌: గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన బీడీఎల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ముత్తంగి డివిజన్‌ పరిధి పాటీ సమీపంలోని వివేకానంద స్టేడియంలో గురువారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వయసు సుమారు 35 నుంచి 40 ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతుడికి సంబంధించిన బంధువులు ఉంటే బీడీఎల్‌ పోలీసులను సంప్రదించాలన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

పటాన్‌చెరుటౌన్‌: చికిత్స పొందుతూ వ్యక్తి మృతిచెందిన సంఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రామచంద్రాపురం ఎస్‌ఎన్‌ కాలనీకి చెందిన మహ్మద్‌ మోహిన్‌ (51) బుధవారం తన కుమారుడు పనిచేస్తున్న జేపీ కాలనీ డివిజన్‌ పరిధిలోని చికెన్‌ షాపునకు నడుచుకుంటూ వెళ్తుండగా, లింగంపల్లి వైపు నుంచి పటాన్‌చెరు వైపు వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన మోహిన్‌ను చికిత్స నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తిరిగి అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

పాపన్నపేట(మెదక్‌): చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ వ్యక్తి.. చివరకు తాను వేసిన వలలో చిక్కుకుని మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని చెలిమల కుంటలో గురువారం వెలుగు చూసింది. ఎస్సై శ్రీనివాస్‌గౌడ్‌ కథనం ప్రకారం.. నాగ్సాన్‌పల్లికి చెందిన గుండు కిష్టయ్య(48) చేపలు పట్టుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో బుధవారం సాయంత్రం చెలిమల కుంట వద్దకు వెళ్లి కొన్ని చేపలు పట్టుకున్నాడు. మరికొన్ని చేపల కోసం వల వేసి కుంటలోనికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు ఆ వల అతని కాళ్లకు చుట్టుకొని నీట మునిగి పోయాడు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు చుట్టుపక్కల వెతికారు. అయినప్పటికీ జాడ తెలియరాలేదు. కుంట వైపు వెళ్లిన గ్రామస్తులకు కిష్టయ్య మృతదేహం కనిపించడంతో కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. మృతుడి కుమారుడు రమేశ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

పటాన్‌చెరు టౌన్‌: ఇంటికి కావాల్సిన కిరాణా సామగ్రి తీసుకొస్తానని చెప్పి బయటకు వెళ్లిన ఒక యువతి అదృశ్యమైన సంఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముత్తంగి డివిజన్‌ పరిధికి చెందిన శాంతి కుమార్తె శ్రేయ (21) ఇంటర్‌ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో గురువారం కిరాణా సామన్లు తీసుకొస్తానని చెప్పి బయటకు వెళ్లిన ఆమె.. ఎంత సమయం గడిచినా తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల ఇళ్లతోపాటు స్థానికంగా వెతికినా శ్రేయ ఆచూకీ లభించలేదు. కూతురు అదృశ్యంపై తల్లి శాంతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement