చోరీ జరిగిన మూడు గంటల్లోనే.. | - | Sakshi
Sakshi News home page

చోరీ జరిగిన మూడు గంటల్లోనే..

May 29 2026 8:16 AM | Updated on May 29 2026 8:16 AM

ఇద్దరు అంతర్రాష్ట్ర మహిళా నేరస్తుల అరెస్ట్‌

అపహరించిన ఆభరణాలు స్వాధీనం

పోలీస్‌ సిబ్బందికి ప్రశంసలు

రామాయంపేట (మెదక్‌): పట్టణంలోని బస్టాండ్‌లో మహిళా ప్రయాణికురాలిని టార్గెట్‌ చేసి క్షణాల్లో నగలు కొట్టేసిన ఇద్దరు అంతర్రాష్ట్ర మహిళా కిలాడీ దొంగలను రామాయంపేట పోలీసులు కేవలం మూడు గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. సీఐ సైదా తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్లా జిల్లా గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేట ప్రాథమిక పాఠశాలలో వంట మనిషిగా సుద్దాల దేవలక్ష్మి పనిచేస్తుంది. బుధవారం తన తల్లితో కలిసి అక్కన్నపేటలోని కూతురు వద్దకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళ్లేందుకు రామాయంపేట బస్టాండుకు చేరుకుంది. అదే సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు దేవలక్ష్మి బ్యాగులో ఉన్న బంగారు ఆభరణాలను కొట్టేయగా.. ఆమె వెంటనే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన ఎస్‌ఐ బాల్‌రాజ్‌ బస్టాండులోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, ముఖాలకు మాస్కులు ధరించిన ఇద్దరు మహిళలు ఆభరణాలు అపహరించినట్లు తేలింది. చోరీ అనంతరం నిందితులు అక్కడి నుంచి మెదక్‌ వెళ్లి, అక్కడి నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న బోధన్‌ డిపో బస్సు ఎక్కినట్లు గుర్తించారు. వెంటనే ఎస్‌ఐ బాల్‌రాజ్‌ ఆ బస్సు కండక్టర్‌కు ఫోన్‌ చేసి సమాచారం అందించగా.. అలర్ట్‌ అయిన కండక్టర్‌ నిందితులకు అనుమానం రాకుండా బస్సును నేరుగా హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. బాధితురాలు దేవలక్ష్మిని వెంట పెట్టుకుని బోయిన్‌పల్లి స్టేషన్‌కు చేరుకున్న పోలీసులు.. నిందితులను కర్ణాటకకు చెందిన శ్వేత కాలే, మహారాష్ట్రకు చెందిన శిల్పా వేలుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి నుంచి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. విచారణలో పట్టుబడిన ఇద్దరు మహిళలకు గతంలో సంగారెడ్డి, జహీరాబాద్‌, జోగిపేట ప్రాంతాల్లో జరిగిన పలు దొంగతనాలతో సంబంధం ఉన్నట్లు తేలింది. అయితే ఫిర్యాదు అందిన మూడు గంటల్లోనే కేసును ఛేదించిన ఎస్‌ఐ బాల్‌రాజ్‌, ఎస్‌ఐ–2 నరేశ్‌, పీసీలు భాస్కర్‌, సూర్యప్రకాశ్‌లను ఎస్పీ శ్రీనివాసరావు ప్రశంసించారు.

Advertisement
 
Advertisement
Advertisement