తిమ్మాపూర్‌ గేట్‌వద్ద రైతుల రాస్తారోకో | - | Sakshi
Sakshi News home page

తిమ్మాపూర్‌ గేట్‌వద్ద రైతుల రాస్తారోకో

May 29 2026 8:16 AM | Updated on May 29 2026 8:16 AM

తిమ్మాపూర్‌ గేట్‌వద్ద రైతుల రాస్తారోకో

కౌడిపల్లి(నర్సాపూర్‌): ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతులు రాస్తారోకో చేపట్టారు. మండలంలోని తిమ్మాపూర్‌గేట్‌ వద్ద 765డి జాతీయ రహదారిపై తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన రైతులు బైఠాయించి ఆందోళన చేశారు. రైతులు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కుప్పలు పోసి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు తూకం, బస్తాల తరలింపు చేయడం లేదన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఆలస్యం అవుతుందని ఆరోపించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ అమరేందర్‌రెడ్డి రైతులకు నచ్చజెప్పి రాస్తారోకోను విరమింపచేశారు.

చిట్కుల్‌లో రైతుల ధర్నా

చిలప్‌చెడ్‌(నర్సాపూర్‌): చిలప్‌చెడ్‌ మండల పరిధి చిట్కుల్‌ గ్రామంలో తడిసిన ధాన్యం కొనడం లేదని గురువారం రైతులు మెదక్‌– జోగిపేట ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడడంతో పోలీసులు, జీపీఓలు ఘటనా స్థలానికి వచ్చి, తప్పకుండా ధాన్యాన్ని కొనేలా చూస్తామని హామీ ఇచ్చారు.

నేడు జొన్నల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

రేగోడ్‌(మెదక్‌): మండలానికి రెండు కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసింది. రేగోడ్‌, గజ్వాడ గ్రామాల్లో నేడు శుక్రవారం జొన్నల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నామని పీసీసీ సభ్యుడు కిషన్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ రాజుయాదవ్‌ గురువారం వేర్వేరుగా తెలిపారు. ఇదిలా ఉండగా ఈనెల 14న సాక్షి దినపత్రికలో ‘జొన్నల కొనుగోలు కేంద్రం ఏదీ’ అనే కథనం ప్రచురితమైంది. ఈ మేరకు ప్రభుత్వం స్పందించి ఈ నిర్ణయం తీసుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement