కల్హేర్(నారాయణఖేడ్): సిర్గాపూర్ మండలం బోక్కస్‌గాం పీఏసీఎస్‌లో అక్రమాలు జరిగిన ఆరోపణలపై విచారణకు వచ్చిన నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి ఎదురుగానే రైతులు రాజకీయ పార్టీల పరంగా రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి స్వల్ప లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బుధవారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. పీఏసీఎస్‌లో అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదు రావడంతో విచారించేందుకు సబ్ కలెక్టర్ ఉమాహారతి పీఏసీఎస్‌ను సందర్శించారు. అప్పటికే చుట్టుపక్క గ్రామాల నుంచి భారీగా రైతులు అక్కడకు చేరుకున్నారు. ఉమాహారతి విచారణకు ఉపక్రమించిన క్రమంలో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన సొసైటీ పర్సన్ ఇన్‌చార్జి గుండు వెంకట్‌రాములు తరఫున కొందరు రైతులు పీఏసీఎస్ తరఫున వరి ధాన్యం, జొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐకేపీ కేంద్రాలు వద్దని నినాదాలు చేశారు. పీఏసీఎస్ తరఫున వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని డిమాండు చేశారు. అదేసమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరికొందరు రైతులు మద్దతుగా నిలిచి పీఏసీఎస్‌లో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య ఘర్షణవాతావరణం ఏర్పడింది. రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందని చెప్పినా సబ్ కలెక్టర్ చెప్పినా ఎవరూ శాంతించలేదు. దీంతో ఉమాహారతి జోక్యం చేసుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో విచారణ చేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో పీఏసీఎస్ అక్రమాల విచారణ అంశం పక్కదారి పట్టింది. ఈ నెల 26న తహసీల్దార్ కిరణ్‌కుమార్ విచారణ జరిపిన విషయం విదితమే. పీఏసీఎస్‌లో నాసిరకంగా గోదాం నిర్మాణం, పెట్రోల్ పంపు ఏర్పాటు చేయకుండానే నిధులు దుర్వినియోగం, తదితర అంశాలపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే పీఏసీఎస్ నుంచి సబ్ కలెక్టర్ వెళ్లిపోయాక కూడా ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి స్వల్ప లాఠీచార్జ్ చేసి పరిస్థితి అదుపులోకి తెచ్చారు.
బోక్కస్‌గాం పీఏసీఎస్ అక్రమాలపైవిచారణకు వచ్చిన ఉమాహారతి
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలంటూ బీఆర్‌ఎస్ ఆందోళన
అక్రమాలపై విచారణ చేయాలనికాంగ్రెస్ పట్టు
ఇరువర్గాలు బాహాబాహీ
స్వల్ప లాఠీచార్జ్‌తో అదుపు చేసినపోలీసులు


