ప్రతిష్టాత్మకంగా సభ్యత్వ నమోదు | - | Sakshi
Sakshi News home page

ప్రతిష్టాత్మకంగా సభ్యత్వ నమోదు

May 28 2026 8:55 AM | Updated on May 28 2026 8:55 AM

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : ఉమ్మడి మెదక్‌ జిల్లాలో పది నియోజకవర్గాలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. స్థానిక నాయకత్వంతో మమేకమై ప్రణాళికబద్ధంగా పనిచేయాలని, సమన్వయంతో పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బుధవారం ఉమ్మడి మెదక్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు నాయకులకు దిశానిర్దేశం చేశారు. నాయకులు ప్రతీ కార్యకర్తకు కొంత సమయం కేటాయించాలని సూచించారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. సాధారణ సభ్యత్వానికి రూ.10, క్రియాశీలక సభ్యత్వానికి రూ.50 రుసుముగా నిర్ణయించామని, ఆన్‌లైన్‌ విధానంలో సభ్యత్వ నమోదు ఉంటుందన్నారు. స్పాట్‌లో లైవ్‌ ఫొటో తీసుకుని ఓటరు వివరాలు కూడా వెంటనే నమోదవుతాయన్నారు. తద్వారా ఈ సభ్యత్వ నమోదు పారదర్శకంగా జరుగుతుందన్నారు. ఈ సభ్యత్వ నమోదు పకడ్బందీగా నిర్వహించడం ద్వారా రానున్న ఎన్నికల్లో పార్టీకి ఎంతో ఉపయోగం ఉంటుందని తెలిపారు. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నామని, రానున్న ఎన్నికల్లో పదికి పది చోట్ల విజయం సాధించేలా పునాదులు వేయాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం, గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతున్నందున..రైతులు, కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా జూన్‌ మొదటి వారంలో ఆన్‌లైన్‌ సభ్యత్వ నమోదు శిక్షణ, అవగాహన కార్యక్రమాలను నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్‌, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాణిక్‌రావు, సునీతారెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పద్మారెడ్డి, క్రాంతికిరణ్‌, భూపాల్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు ఒంటేరు ప్రతాపరెడ్డి, దేవీప్రసాద్‌, ఎర్రోళ్ల శ్రీనివాస్‌, మెంబర్షిప్‌ డ్రైవ్‌ జిల్లా ఇన్‌చార్జి బాలమల్లు పాల్గొన్నారు.

ప్రతీ కార్యకర్తకు సమయం ఇవ్వండి

నాయకులు, కార్యకర్తలుసమన్వయంతో పనిచేయాలి

సభ్యత్వ నమోదు సన్నాహకసమావేశంలో హరీశ్‌రావు

Advertisement
 
Advertisement
Advertisement