సిద్దిపేటఅర్బన్: మిట్టపల్లిలోని సురభి మెడికల్ కళాశాల అనుబంధ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో బుధవారం అరుదైన పైలో ప్లాస్టీ సర్జరీ విజయవంతంగా నిర్వహించినట్టు ఆస్పత్రి చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ దీప్తిరావు తెలిపారు. బుధవారం ఆయన సర్జరీ వివరాలు వెల్లడించారు. కొమురవెళ్లి మండలం మర్రిముస్త్యాల గ్రామానికి చెందిన చక్రధర్ (7)కు కిడ్నీ, మూత్రనాళం కలిసే ప్రాంతం మూసుకుపోయి కిడ్నీ వాచిపోతుండటంతో ఈ నెల 23న ఆస్పత్రికి వచ్చారు. యూరాలజిస్ట్ డాక్టర్ చంద్రప్రకాశ్ ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీలో పైలోప్లాస్టీ సర్జరీ చేసి కిడ్నీ పాడవకుండా కాపాడినట్టు తెలిపారు. చైర్మన్ హరీందర్‌రావు ఆశయం మేరకు ఆస్పత్రిలో అన్ని రకాల వైద్య సేవలు ఆరోగ్యశ్రీలో ఉచితంగా అందిస్తున్నామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్రమీలకు పీహెచ్‌డీ
బెజ్జంకి(సిద్దిపేట): మండల కేంద్రానికి చెందిన లెక్చరర్ రొడ్డ ప్రమీల మధ్యప్రదేశ్‌లోని శ్రీకృష్ణ యూనివర్సిటీ నుంచి వీసీ అమిత్ కుమార్ జైన్ చేతుల మీదుగా పీహెచ్‌డీ పట్టా అందుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ఆటోమొబైల్ రంగంలో విదేశీ పెట్టుబడులు అనే అంశంపై ఆమె సమర్పించిన ప్రాజెక్టుకు గాను పీహెచ్‌డీ వరించింది. కాగా ఆమె సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్ లెక్చరర్‌గా పని చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రమీలను స్నేహితులు, విద్యావేత్తలు అభినందించారు.
ఎల్లంపల్లిలో విగ్రహాల ధ్వంసం
టేక్మాల్(మెదక్): మండలంలోని ఎల్లంపల్లి గ్రామం ఆలయంలోని నవగ్రహ విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. కాగా గ్రామానికి చెందిన సండ్రు శాంతం బుధవారం ఉదయం నవగ్రహ పూజ చేసేందుకు వెళ్లగా రెండు విగ్రహాలు కిందపడవేసి ధ్వంసం చేసినట్లు ఉన్నాయని తెలిపారు. దీంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. శాంతం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఇసుక అక్రమ
రవాణాదారుల బైండోవర్
బెజ్జంకి(సిద్దిపేట): ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరిని మండల శివారులో బుధవా రం అరెస్ట్ చేశారు. అనంతరం మండల తహసీల్దార్ శ్రీకాంత్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్‌ఐ తోట తిరుపతి తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లికి చెందిన బొద్దుల రాకేశ్, కరీంనగర్ జిల్లా రేణికుంటకు చెందిన ప్రవీణ్‌కుమార్ రేణికుంట పరిసర ప్రాంతాల నుంచి ఇసుకను తరలిస్తూ పట్టుబడనట్లు తెలిపారు.
తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు మృతి
మద్దూరు(హుస్నాబాద్): ప్రమాదవశాత్తు తాటిచెట్టు పైనుంచి పడిన గీత కార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని వల్లంపట్ల గ్రామంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన గుండెగోని రాజుగౌడ్(35) కల్లు తీయడానికి రోజు మాదిరిగానే చెట్టు ఎక్కుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు చెట్టు పైనుంచి కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.


