శిథిలావస్థలో ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ ● పెచ్చులూడి పడుతున్న వైనం ● 80 సంవత్సరాల క్రితం నిర్మాణం ప్రతిపాదనల్లోనే నూతన భవనం పట్టించుకోని అధికారులు
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): గతంలో ఉన్నతాధికారులు, మంత్రులు, ప్రముఖులెందరికో ఆతిథ్యం ఇచ్చిన అలనాటి ఆర్‌అండ్‌బీ అతిథి భవనం నేడు శిథిలావస్థకు చేరి కళ తప్పింది. సదాశివపేట పట్టణ పరిధిలో ఉన్న ఈ భవనం నిర్మించి దాదాపు 80 ఏళ్లు అవుతోంది. తరుచుగా పైకప్పు, గోడల పెచ్చులూడి పడుతున్నాయి. దీంతో ప్రమాదం పొంచి ఉంది. 18 సంవత్సరాలుగా నిర్వహణ లేకపోవడంతో భవనం ఆవరణ చుట్టూ పిచ్చిమొక్కలతో దర్శనమిస్తుంది. అలాగే రాత్రి అయితే చాలు మందుబాబులకు అడ్డాగా మారిందని స్థానికులు వాపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఒక రాత్రికి విశ్రాంతి తీసుకొని వెళ్దామన్న వెళ్లలేని పరిస్థితి దాపురించిందని పేర్కొంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, పాలకులకు ఎంతోమందికి ఆతిథ్యం ఇచ్చిన ఈ భవనం నేడు కళావిహీనంగా మారి శిథిలావస్థకు చేరింది. ఎలాంటి ప్రమాదం జరగక ముందే అధికారులు, ప్రభుత్వం మేల్కొని నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికై నా నూతన గెస్ట్‌హౌస్‌ను నిర్మించి సకల సదుపాయాలతో అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత అధికారులు, పాలకులపై ఉంది.
నూతన భవనానికి ప్రతిపాదనలు
శిథిలావస్థకు చేరిన భవనాన్ని పూర్తిగా తొలగించి, నూతన భవనం నిర్మించడానికి రూ.3.80కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. త్వరలోనే నిధుల మంజూరుకు పరిపాలన పరమైన అనుమతి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ అతిథి గృహం శిథిలావస్థకు చేరిన విషయంపై దృష్టి సారించాం. నిధులు మంజూరు కాగానే టెండర్ ప్రక్రియను పూర్తి చేసి పనులను ప్రారంభిస్తాం.
– రామకృష్ణ, ఆర్‌అండ్‌బీ డీఈఈ, సంగారెడ్డి


