చిన్నశంకరంపేట(మెదక్): ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని గజగట్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ శివానందం కథనం ప్రకారం... గ్రామానికి చెందిన బోయిని రాజయ్య(45) తన పొలంలో బోర్లు వేసి అప్పులపాలయ్యాడు. అప్పులను తీర్చేందుకు భార్య ఎల్లవ్వ, నడిపి కుమారుడు మణికంఠతో కలిసి జీడిమెట్లలో నివాసం ఉంటూ కూలీ పనులకు వెళ్తున్నాడు. కాగా పెద్ద కుమారుడు మహేశ్ పెయింటింగ్ పని చేస్తుండగా, చిన్న కుమారుడు ముఖేశ్ ఇంటి వద్దే ఉంటున్నాడు. రెండు రోజుల క్రితం గ్రామానికి వచ్చిన రాజయ్య అప్పుల బాధతో బాధపడుతూ ఎలా తీరుస్తామని పలుమార్లు పెద్ద కుమారుడు మహేశ్‌కు చెబుతూ బాధపడేవాడు. బుధవారం మహేశ్ పనికి వెళ్లగా, చిన్నకుమారుడు స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో రాజయ్య ఇంట్లో ఉరివేసుకున్నాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన చిన్న కుమారుడు గమనించి సోదరుడికి చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
అప్పుల బాధ తాళలేక యువకుడు..
మిరుదొడ్డి(దుబ్బాక): అప్పుల బాధ తాళలేక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన కుమ్మరి యాదగిరి (32)కి 12 సంవత్సరాల క్రితం స్వప్నతో వివాహం జరిగింది. వీరికి పది సంవత్సరాలలోపు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా యాదగిరి తాగుడుకు బానిసగా మారడంతో అప్పులు ఎక్కువయ్యాయి. దీంతో బతుకు దెరువు కోసం కొట్కూర్ అనే గ్రామానికి వలస వెళ్లాడు. కాగా ఈ నెల 26న మిరుదొడ్డిలో యాదగిరి మేనమామ అనారోగ్యంతో మృతి చెందగా అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. తాగుడుకు బానిసవ్వడంతో, అప్పులెక్కువయ్యాయని మదన పడుతూ బుధవారం తన సొంతింట్లో ఉరివేసుకున్నాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


