● ప్రతి కార్యాలయంలో కంప్లయింట్ కమిటీ తప్పనిసరి ● అదనపు కలెక్టర్ నగేశ్
మెదక్ కలెక్టరేట్: మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగా జిల్లాలో మహిళా భద్రత, రక్షణ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. బుధవారం వారోత్సవాల్లో భాగంగా సమీకృత కలెక్టరేట్‌లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013పై మహిళా ఉద్యోగులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించటానికి ఏర్పడ్డ చట్టమని తెలిపారు. ప్రతీ కార్యాలయంలో మహిళలకు భయరహితమైన, సమానమైన, గౌరవప్రదమైన పని వాతావరణం ఉండాలన్నారు. ప్రతీ ఆఫీస్‌లో ఇంటర్నల్ కంప్లయింట్స్ కమిటీ ఉండాలన్నారు. ఒకవేళ సంస్థలో అంతర్గత కమిటీ లేకపోతే లేదా ఉన్నతాధికారులపై ఫిర్యాదు చేయాల్సి వస్తే, భారత ప్రభుత్వం షీబాక్స్ పోర్టల్ ద్వారా నేరుగా ఫిర్యాదు చేసే సదుపాయం కల్పించిందన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ అంబదాస్ రాజేశ్వర్ , ఇన్చార్జి జిల్లా సంక్షేమ అధికారి స్వరూప, వివిధ శాఖలకు చెందిన జిల్లా, మండల, గ్రామ స్థాయి మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.


