● ఆదుకుంటుందని రైతుల నమ్మకం ● గత ఖరీఫ్‌లో ఇతర పంటలతో నష్టం ● అందుకే చెరుకుపై అన్నదాతల ఆసక్తి
గణనీయంగా పెరిగిన పంట విస్తీర్ణం
జహీరాబాద్ టౌన్: చెరుకు సాగుపై రైతులు ఆసక్తి చూపడంతో జిల్లాలో విస్తీర్ణం పెరిగింది. గత ఖరీఫ్ సీజన్‌లో వేసిన పత్తి, ఆలు, అల్లం తదితర పంటలు వర్షాలకు చాలా వరకు దెబ్బతిన్నాయి. మద్దతు ధర కూడా లేక పండిన పంటను కొనేవారు కరువై నష్టపోయిన రైతులు ఈ సారి చెరుకు సాగుకు మొగ్గు చూపుతున్నారు.
ఈ ఏడాది చెరుకు సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ప్రస్తుత పరిస్థితులు పంట సాగుకు అనుకూలంగా ఉంది. మూడు సంవత్సరాల నుంచి బంద్ ఉన్న ట్రైడెంట్ చక్కర కర్మాగారంలో క్రషింగ్‌కు సిద్ధమవుతుంది. రాయికోడ్ మండలంలో కొత్తగా ఏర్పాటు చేసిన గోదావరి–గంగా చక్కర కర్మాగారంలో రెండు సీజన్‌ల నుంచి క్రషింగ్ విజయవంతంగా పూర్తి చేశారు. పంటకు గిట్టుబాటు ధర కూడా దక్కడంతో ఆదుకుంటుందన్న భరోసాతో రైతులు పంటను వేశారు. జిల్లాలో చెరుకు, పత్తి, అల్లం, అరటి, ఆలుతో పాటు కంది, సోయాబిన్, పెసర, మొక్కజొన్న, శనగ పంటలను పండిస్తారు. రెండు సంవత్సరాల నుంచి నెలకొన్న అతివృష్టి వల్ల ఖరీఫ్ పంటలు దెబ్బతిన్నాయి. అదే చెరుకు పంట సాగు చేసిన రైతులకు పెద్దగా నష్టం కలగలేదు. దీంతో ఈ సంవత్సరం రైతులు చెరుకు సాగు వైపు ఆసక్తి చూపుతున్నారు.
45 వేల ఎకరాల్లో...
జిల్లాలో గత ఏడాది 36 వేల ఎకరాల్లో రైతులు చెరుకును సాగు చేశారు. ఈ సంవత్సరం సుమారు 45 వేల ఎకరాల్లో పంట సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సుమారు 43 వేల ఎకరాల్లో పంట వేసినట్లు తెలిసింది. జూన్ నెలాఖరు వరకు ప్లాంటేషన్ కొనసాగుతుందని, సాగు విస్తీర్ణం మరింత పెరుగుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. రైతులు చెరుకు విత్తే పనుల్లో నిమగ్నమయ్యారు. 2026–27వ క్రషింగ్ సీజన్ ఈ సంవత్సరం అక్టోబర్‌లోనే ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వేరే పంటలతో నష్ట పోయా..
గత సంవత్సరం పది ఎకరాల్లో పత్తి పంట వేయగా భారీ వర్షాలకు దెబ్బతింది. పెట్టుబడులు కూడా రాకా నష్టపోయాను. చెరుకు పండించిన రైతులు నష్టపోలేదని తెలుసుకొని ఈ సంవత్సరం ఆరు ఎకరాల్లో సాగు చేశా. నా మాదిరిగా చాలా మంది రైతులు చెరుకు పంటను వేశారు.
–శివాజీ రాథోడ్, రైతు


